Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలేడికి లేచిందే పరుగు

లేడికి లేచిందే పరుగు

Naya Samvidhaan:
“రాజ్యాంగం దురుపయోగమైతే, దానికి బాధ్యత రాజ్యాంగానిది కాదు.. దాన్ని అమలు చేస్తున్న వ్యక్తులదే”-అంబేడ్కర్.

కేసిఆర్ ఏమైనా  చేయగలడు.
చంద్రబాబు దగ్గరున్నప్పుడే జన్మభూమి పథకం రాశాడని  ఆయన అభిమానులు చెప్తారు.
టీడీపీ నుంచి బయటికొచ్చాక ఉద్యమ వ్యూహాలు రచించాడు.
టీఆర్ఎస్ పార్టీకి దారీ తెన్ను చూపించాడు.
పాటలు రాశాడు
పార్టీకి మేనిఫెస్టో రాశాడు.
రాష్ట్రం సాధించాక బంగారు తెలంగాణకి దారులు గీశాడు.
గోదావరిని కింద నుంచి పైకెలా పంపాలో ప్లాన్లు గీశాడు.
ఎన్నికల ముందు దళిత బంధు లాంటి స్కీములు రాశాడు.
ఇన్ని చేసిన లీడర్
ఇన్ని రాసిన రాసిన వ్యక్తి
ఒక్క రాజ్యాంగం రాయలేడా?

రాయొచ్చు..

కేసిఆర్ కి తెలియని రాజకీయాలా?
కేసిఆర్ కి తెలియని రాజ్యాంగ వ్యవస్థలా?
జీవితకాలంలో వేలాది పుస్తకాలు చదివిన కేసిఆర్
బహుశా రాజ్యాంగాన్ని కూడా అనేకసార్లు చదివేసే వుంటాడు.
ఆ మాటకొస్తే, ఒక కొత్త రాజ్యాంగాన్ని ఇప్పటికే రాసిపెట్టుకున్నాడేమో అని డౌట్.
కేసిఆర్ కొత్త  రాజ్యాంగం కావాలన్నాడు.
కానీ వున్న రాజ్యాంగంలో లోటేంటో స్పష్టంగా చెప్పలేదు.
తన అనుభవంలో కేసిఆర్ కి చాలా లోటు పాట్లు కనిపించే వుంటాయి.

దళితుడిని  సిఎంని చేస్తానని చెప్పి చేయకపోయినా ఈ రాజ్యాంగం ఏం చేయలేకపోయింది.
తన కుటుంబానికే పదవులన్నీ ఇచ్చుకున్నా రాజ్యాంగం మారుమాట్టాడలేకపోయింది.
అధికారంలోకి రాగానే, ప్రతిపక్ష ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని టోకుగా లాక్కున్నా ఈ రాజ్యాంగం చేతులు కట్టుకుని కూర్చుంది..
మీడియాని ఆరడుగుల గొయ్యి తీసి పాతేస్తానన్నా ..
ఈ రాజ్యాంగం ప్రభుత్వాన్ని భయపెట్టలేకపోయింది.
రేపు ఎన్నికలంటే ఇవాళ పథకాలు పెట్టి డబ్బు పంచుతానన్నా రాజ్యాంగం మౌనంగా చూస్తూ వుండిపోయింది.
వోటుకి అయిదువేలు రేటు పెట్టినా రాజ్యాంగం అడ్డుకోలేకపోయింది.
చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత వుంటుంది.

కాబట్టీ స్వయంగా రాజ్యాంగ పదవిలో వుండి,
రాజ్యాంగంలో బలహీనతల్ని ప్రత్యక్షంగా చూసిన వాడు కేసిఆర్.
కనుక ఈ రాజ్యాంగం మీద మొహం మొత్తి,
తనే ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసేయాలని అనుకోవడం సహజమే.
నిజానికి రాజ్యాంగం మార్చకూడనిదేం కాదు.
కేసిఆర్ చెప్పినట్టు ఇప్పటికే 88 సార్లుమారింది.
కొత్త రాజ్యాంగం రాయకూడదని కూడా రూల్ లేదు.
రాజ్యాంగాన్ని రివైజ్ చేయడానికి గతంలో ఒక కమిటీని  కూడా వేశారు..

అంతెందుకు..
రెండున్నరేళ్ళపాటు అహర్నిశలూ కష్టపడి  రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కరే..  ఒక దశలో రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి కూడా తాను సిద్ధమే అన్నాడు.
అంబేడ్కర్ అంత మాట ఎందుకన్నారని పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. దానికి ఆయనే సమాధానం ఇచ్చాడు.


“మనం ఒక గుడి కడతాం..
అందులో దేవుడిని ప్రతిష్టించాలనుకుంటాం.
కానీ, దేవుడికంటే ముందే దయ్యం తిష్ట  వేసుకుని కూర్చుంటే ఏం చేయగలం..
గుడిని కూల్చేయడమే.
దేవతలుండాల్సిన గుడిలో రాక్షసులుండడం కంటే, అసలు ఆ గుడే లేకపోవడం నయం కదా..
అందుకే తప్పదనుకుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టడానికైనా సిద్ధమని చెప్పాను..” అని తన వ్యాఖ్యలకి పార్లమెంటులో వివరణ ఇచ్చాడు అంబేడ్కర్.

అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గుడి అనుకునే కట్టాడు.
ఈ డెబ్బైయేళ్లలో అందులో దేవతలుంటే అది దేవాలయంలా కనిపించింది. దెయ్యాలున్నప్పుడు బూత్ బంగ్లాలా మారింది.
ఇప్పుడీ రాజ్యాంగం పనిచేయడంలేదని కేసిఆర్ అంటున్నాడు.
మరి దెయ్యాలని తరిమేయాలా?
గుడిని కూల్చేయాలా?
జనం చర్చించాల్సిందే..
డెబ్భైయేళ్ల తర్వాతైనా దెబ్బకి దెయ్యాల్ని వదిలించాల్సిందే..

Kcr New Constitution

కొసమెరుపేంటంటే, ఇటు కొత్త రాజ్యాంగం రాయాలని కేసిఆర్ అనగానే అటు తెలంగాణ బిజెపి నేతలు అంబేడ్కర్ విగ్రహాల చుట్టూ మూగిపోయారు. అసలు భారత రాజ్యాంగం పుట్టుక నుంచే దీనికి ఆర్ఎస్ఎస్ బద్ధ విరోధి. మనుస్మృతి వుండగా రాజ్యాంగం ఎందుకు దండగ… అన్నది ఆర్ఎస్ఎస్ నినాదం.  వాజ్ పేయి స్వయంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నాడు. రాజ్యాంగం కంటే భగవద్గీతే గొప్పదని సీనియర్ బిజెపి నేతల ఉవాచ. నిన్న గాక మొన్న కర్ణాటకలో బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే  ఈ రాజ్యాంగం పనికిరాదనీ, ఇందులో లౌకిక అనే పదాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం రాయాలని డిమాండ్ చేశాడు. అలాంటి బిజెపి ఇవాళ రాజ్యాంగ పరిరక్షణకి అంబేడ్కర్ విగ్రహాలచుట్టూ మూగిందంటే, రాజ్యాంగ అభిమానులందరూ కేసిఆర్ కి థాంక్స్ చెప్పాల్సిందే.

-శైలి

Also Read : శాంతి- అశాంతి- భ్రాంతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్