Himantha comments : ఏ భాషలో అయినా తిట్టు తిట్టే. ఆ తిట్లను చెప్పి తిట్ల దండకానికి అనవసరమయిన ప్రాచుర్యం కల్పించడం సభా మర్యాద కాదు. అయితే ఓ టీ టీ వెబ్ సీరీస్ బూతులు, ఇంగ్లీషు షిట్ లాంగ్వేజ్ బూతులు మర్యాదస్తులు తప్పనిసరిగా వాడాల్సినవిగా మారిపోయాయి. దాంతో అలవోకగా బూతులు వాడే వారి భాషకు ఒక సమ్మతి ఏదో వచ్చినట్లు ఉంది.
ఇంగ్లీషులో “అన్ పార్లమెంటరీ” అని మహా అగౌరవంగా ప్రస్తావించే మాటకు నిఘంటువులో ఏ అర్థముందో కానీ…నిజ జీవితంలో పార్లమెంటేరియన్లదే చాలా అన్ పార్లమెంటరీ భాష అవుతోంది. చట్టసభల్లో ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడకూడదు. చట్టసభల విలువలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలకు లోబడే మాట్లాడాలి. ఆ కోణంలో అభ్యంతరకరమయిన మాటలన్నీ అన్ పార్లమెంటరీ మాటలే అవుతాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాటలు ఎంత అన్ పార్లమెంటరీ అని తేల్చడానికి రాజ్యాంగ నిపుణులు తమ బుర్రలకు పని పెట్టాలి. ఒక ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడిని ఇంత అన్ పార్లమెంటరీ భాషతో తిట్టవచ్చా? తిడితే పార్లమెంటు ఊరికే ఉండవచ్చా?
రాజకీయ వైరుధ్యాలు ఎన్నయినా ఉండవచ్చు. ఒక నెహ్రు, ఒక ఇందిర, ఒక రాజీవ్ గాంధీ అంటే ఆషామాషీ నాయకులా? ఈ దేశానికి వారి కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? ఆ మాటకొస్తే ఒక వార్డు మెంబరునయినా, నిలువ నీడ లేని అనామక మనిషనయినా అస్సాం ముఖ్యమంత్రి అంత మాట అనవచ్చా?
నిజంగా రాహుల్ గాంధీ ప్రశ్న పసలేనిదయితే ఆయన అజ్ఞానమే బయటపడుతుంది. “సైనికుల త్యాగాలను అగౌరవపరిచే ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు…అడిగినా స్పందించాల్సిన పనిలేదు” అని వదిలేస్తే పోయేదానికి…ఎవరు ఎవరికి పుట్టారో? ఎవరు ఎవరి సంతానమో? డి ఎన్ ఏ పరీక్షల రక్త నమూనాల సేకరణకు దిగుతారా?
ఎవరయినా ఒక్క ఉపకారం చేస్తే రాముడు పదే పదే దాన్నే తలచుకుని పొంగిపోతూ ఉంటాడట. వంద అపకారాలు చేసిన మనిషి గురించి న స్మరంతి…అనుకోను కూడా అనుకోడట…అని రాముడి గుణగణాలను వర్ణిస్తూ వాల్మీకి పరవశించి చెప్పిన మాట. రామరాజ్యం తెచ్చామని చెప్పుకునే ప్రభువులు రాముడి ఆదర్శాలను పాటిస్తున్నారా?
బహిరంగసభల్లో ఆవేశంలో ఒకవేళ పొరపాటున నోరు జారవచ్చు. కనీసం ఆ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయిన తరువాత అయినా…హిమంతుడు తన వ్యాఖ్యలను గౌరవంగా ఉపసంహరించుకోవాల్సింది. రాహుల్ కు క్షమాపణ చెప్పాల్సింది. పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది. కానీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లే హిమంత్ చెప్పుకుంటున్నారు.
రాహుల్ ను జోకర్ గా చిత్రీకరిస్తూ ఈ క్షణానికి బి జె పి ఆనందిస్తూ ఉండవచ్చు. చేసిన పాపము…చెడని పదార్థము…అన్నది పాపపుణ్యాల సిద్ధాంతం. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని కర్మలు మూడు రకాలు. హిమంత విశ్వ శర్మ కర్మ ఇందులో ఏ కర్మగా ఖర్మ కాలుతుందో పాప పుణ్యాల గరుడపురాణ శిక్షలకు వదిలేద్దాం.
ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కనీస మర్యాదలు పాటించాలి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే ధర్మ ప్రభువులకు ఈ నవీన శర్మ ధర్మం గురించి విడమరిచి చెప్పేవారెవరు? చెప్పినా వినే శర్మలు ఎవరు?
సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగిన ప్రశ్న:-
ఒరేయ్! నీ కొలువులో మంచి- చెడు చెప్పేవారు లేరా? లేక చెప్పినా నువ్ వినవా?
దీనికి రావణాసురుడి సమాధానం:-
నాకు చెడు తెలుసు- చేయకుండా ఉండలేను; మంచి తెలుసు- చేయలేను. స్వభావో దురతిక్రమః. నా స్వభావం మారదు.
రామాయణాన్ని మనం పూజిస్తాం. సుదరకాండ నిత్యపారాయణ చేస్తాం. అంతే!
ఆరువందల సంవత్సరాల క్రితం ఇలాంటి హిమంత్ శర్మలు ఎవరు ఎంతటి మాటన్నారో కానీ…జీవుడి పునర్జన్మలను తాత్వికంగా దర్శించాడు అన్నమయ్య.
“ఎవ్వరెవ్వ రి వాడొ ఈ జీవుడు?
చూడ నెవ్వరికి నేమవునో ఈ జీవుడు?
ఎందరికి కొడుకుగాడీజీవుడు?
వెనక కెందరికి తోబుట్టడీజీవుడు?
ఎందరిని భ్రమ యించ డీజీవుడు?
దుఃఖ మెందరికి గావింప డీజీవుడు ?
ఎక్కడెక్కడ తిరుగడీజీవుడు?
వెనుక కెక్కడో తన జన్మ మీజీవుడు?
ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు?
ఎప్పుడె క్కడికి నేగునో ఈ జీవుడు?
ఎన్నడును చేటులేనీజీవుడు?
వెనుక కెన్ని తనువులు మోవడీ జీవుడు?”
పోయిన జన్మలో ఈ జీవుడు ఎవరి కొడుకో?
ఎన్నెన్ని జన్మల్లో ఈ జీవుడు ఎందరికి కొడుకో?
ఈ సూత్రం ప్రకారం హిమంత్ శర్మ పోయిన జన్మలో ఎవరి కొడుకో?
వచ్చే జన్మలో ఎవరి కొడుకో?
హిందూమతం మౌలిక సూత్రమయిన పునర్జన్మ గురించి అప్పుడంటే అన్నమయ్య అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పగలిగాడు. ఇప్పుడు హిమంత్ శర్మలకు తండ్రీ కొడుకుల పుట్టు పూర్వోత్తరాలను విడమరచి చెప్పే అన్నమయ్యలు ఎక్కడున్నారు?
ఉన్నా అన్నమయ్యల భాష ఈ శర్మలకు అర్థమవుతుందా?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :