శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతో ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. శ్రీ గౌరి పెద్ది 101వ జయంతి సందర్బంగా ఆదివారం రాత్రి శ్రీ అన్నమాచార్య కళామందిరంలో జరిగిన సభకు చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఈ సందర్బంగా ఆయన ఆవిష్కరించారు.
కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. తమ చిన్న తనంలో తెలుసుకున్న సాహితీ విషయాలను తలచుకుని నేటి తరం వారిని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి ఉందన్నారు.అన్నమాచార్య కళామందిరం, త్యాగరాజమందిరం తిరుపతి లో గొప్ప సాహితీ వేదికలుగా నిలిచాయన్నారు. గౌరిపెద్ది వారి గురించి మాట్లాడటం తన అదృష్ట మన్నారు. నేటి తరం వారు తమ కంటే ముందున్న గొప్ప తరాన్ని గురించి తెలుసుకోలేక పోతున్నారనే బాధ ఉందన్నారు. నేటి తరానికి అలాంటి వారి గురించి తెలుసుకోవాలన్న తపన లేదని, చెప్పే వారు కూడా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమాచార్య కళామందిరంతో తనకు చిన్న నాటి నుండి ఉన్న అనుభూతులను కరుణాకర రెడ్డి గుర్తు చేసుకున్నారు.
నేటి కాలంలో సాహిత్య పుస్తకాలు చదివే అలవాటు తగ్గి పోయిందని, ఇది సమాజానికి మంచిది కాదని కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతాన్ని ఒక్కసారి తిరగేసి మనసుతో చదివితే పరిపూర్ణులు కాగలిగినంత పాండిత్య శక్తి పూర్వీకులు మనకు ఇచ్చారని ఆయన తెలిపారు. అలాంటి పాండిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం గతంలో చేశానని, మరో సారి ప్రయత్నం చేస్తానని, ఇది అందరి సహకారంతో జరగాల్సిన పని అని ఆయన చెప్పారు.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ‘నవచండీ సంప్రదాయం- వైదికత’, పమిడి కాల్వ మధుసూధన్ ‘గౌరిపెద్ది వారి సాహిత్య సంవీక్షణం’, డాక్టర్ నాగరాజ్య లక్ష్మి ‘గౌరి పెద్దివారి పాండిత్యం-అవధాన పద్య సౌరభం’ అంశాలపై ఉపన్యసించారు. శ్రీ గౌరి పెద్ది కుమారులు శంకర భగవాన్ పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ సభకు అధ్యక్షత వహించారు.