Sunday, January 19, 2025
HomeTrending NewsSSC: పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం

SSC: పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసిన విద్యార్థుల ఫలితాలొచ్చేశాయి. విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు రిలీజ్ చేశారు. గత పది పరీక్షల్లో లాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. నిన్న రిలీజ్ అయిన ఇంటర్ పరీక్షల్లో కూడా అమ్మాయిలే సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు.

ధైర్యంగా ఉండండి..

నిన్న ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు

తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

మార్కులు తక్కువగా వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడవద్దు

తప్పుడు నిర్ణయాలు తీసుకునేప్పుడు తల్లితండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోండి

తల్లిదండ్రులు కూడా పిల్లలకు మనోధైర్యం ఇచ్చి అండగా నిలవాలి

విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం

వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం

వెనుకబడతామనే ఆందోళన విద్యార్థుల్లో అక్కర్లేదు

మే-26 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు ఛాన్స్

జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి

గురుకులాల్లో వచ్చిన సక్సెస్ మిగతా పాఠశాలల్లో రావాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

ఉత్తీర్ణత ఇలా..

మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత

బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత

బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత

నిర్మల్ జిల్లా అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణత

వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానం

2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత

వందశాతం ఉత్తీర్ణత వచ్చిన వాటిలో 1410 ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి

25 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ అవ్వని పరిస్థితి..

అదరగొట్టిన స్కూల్స్ ఇవీ..

గణనీయంగా 98.25% ఉత్తీర్ణత సాధించిన రెసిడెన్షియల్ స్కూల్స్

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ : 95.24%

బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ : 95.03%

మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ : 94.66%

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ : 92.93%

మోడల్ స్కూల్స్ : 91.30%

ప్రైవేట్ స్కూల్స్ : 90.90%

కేజీబీవీ స్కూల్స్ : 83.86%

ఆశ్రమ స్కూల్స్ : 77.67%

జిల్లా పరిషత్ స్కూల్స్ : 79.47%

ప్రభుత్వ పాఠశాలలు : 72.39% మంది విద్యార్థులు పాస్ అయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

కాగా.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జవాబు పత్రాలు గల్లంతైన 9 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాల వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. గతనెల-03న తెలుగు జవాబు పత్రాల బండిల్ గల్లంతైన విషయం తెలిసిందే.

ఆవేశం వద్దు.. ఆలోచించండి..!

పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని పిల్లలకు తల్లిదండ్రులు పెద్ద సపోర్ట్‌గా నిలవాలే కానీ మరో విద్యార్థితో పోల్చి చూసి కోప్పడితే వారిని నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఫెయిల్ అయితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. పరీక్షల్లో ఫెయిలైతే మళ్లీ సప్లిమెంటరీ అనేది ఒకటి ఉంటుంది కదా.. కానీ ప్రాణం పోతే సప్లిమెంటరీ ఉండదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తమను కోల్పోతే వారు ఏమవుతారోనని ఒక్కసారైనా ఆలోచించాలి. అసలు నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి.. అంతటి ధైర్యమేదో సమస్యను ఎదుర్కోవడంలోనో.. ఫెయిలైన అనంతరం జీవితాన్ని మలచుకోవడం పైనో పెడితే ఆ తరువాతి జీవితం అద్భుతంగా ఉంటుందన్న విషయం తెలుసుకుంటే మంచిది.

పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఎస్సెస్సీ ఫలితాల్లో ఏకంగా నంబర్‌వన్‌గా నిలవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ , జిల్లా విద్య శాఖ ఆదికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులను మంత్రి అభినందించారు. ఇదే ఉత్సాహంతో పని చేసి, మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని కొరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్