Thursday, May 30, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగులో వైరస్సే లేదు!

తెలుగులో వైరస్సే లేదు!

Not at all virus: ఇంగ్లీషులో బ్యాక్టీరియా వేరు. వైరస్ వేరు. కరోనా దెబ్బకు డాక్టర్లకంటే జనమే ఎక్కువ వైద్యశాస్త్రం లోతులు చూసినట్లున్నారు. బ్యాక్టీరియా ఏక కణ జీవి. వైరస్ జీవి కాదు. కేవలం ప్రోటీన్ కణం. వైరస్ వ్యాపించడానికి జీవకణాలను వెతుక్కుంటుంది. ఎంత బలహీనమయిన శరీరమయితే అంతగా వైరస్ విజృంభిస్తుంది. లాటిన్ లో వైరస్ అంటే విషం. భాషలో కొత్త మాట పుట్టాలంటే ఆ భావనకు దగ్గరిగా అప్పటికే ఉన్న మాటతో చెప్పడం పరిపాటి. మనకు ముందు కారానికి మిరియాలే ఉండేవి. మిరపకాయలు తరువాత వచ్చాయి. మిరియాలను రీప్లేస్ చేశాయి కాబట్టి మిరియంపు కాయ- మిరపకాయ అన్నాం. మిరపకాయ ఘాటుకు పాపం మిరియాలు వెనక్కు వెళ్లాయి. సహజంగా ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి.

ముప్పయ్, నలభై ఏళ్లుగా ఇంగ్లీషు మాటలను యథాతథంగా వాడుతున్నాం. అందులో తప్పు లేదు. శాస్త్ర సాంకేతిక వస్తువులు, భావనలను, పరిభాషను అలాగే వాడడం తప్పదు కూడా. ప్రవహించేదే భాష అన్నది నిర్వచనం. అందులో కొత్తనీరు కలుస్తూనే ఉంటుంది. కలవాలి కూడా. లేకపోతే తాగడానికి మంచినీరుగా పనికిరాదు. ప్రవహించని నీరు కొంతకాలానికి మురుగునీరుగా కంపు కొడుతుంది. తాగడానికి, వాడడానికి పనికిరాదు. భాష కూడా అంతే.

సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపొయింది. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఫ్లయిట్ బోర్డింగ్ అయిపోయింది. కార్ స్పీడ్ గా వెళ్ళింది. కాచిగూడ ఎక్స్ ప్రెస్ లేట్ గా వచ్చింది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చెయ్. ఏ సీ ఆన్ చెయ్– ఇదంతా అక్షరాలా తెలుగే. చివర క్రియాపదం మీదే భాష బతుకుతుందన్నది భాషా శాస్త్రంలో ఒక లోతయిన పరిశీలన.

కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ మాటలకు తెలుగు పదాలు ఎక్కడ ఉన్నాయని వెతకడం వృథా ప్రయాస. మన తెలుగులో పరమ ప్రమాణమయిన శబ్ద రత్నాకరంలో, సూర్యరాయాంధ్ర నిఘంటువుల్లో సూక్ష్మక్రిమి అన్న మాటే లేదు. స్వతంత్రమయిన పదాలనే నిఘంటువు గుర్తిస్తుంది. సూక్ష్మ క్రిమి రెండు వేరు వేరు పదాలు ఒకటిగా కలిసిన సమాసం. కాబట్టి సాంకేతికంగా నిఘంటువుల్లో ఉండదు కూడా. పారిభాషిక పదాల నిఘంటువుల్లో లేదా ఆయా ప్రత్యేక శాస్త్రాల్లో మాత్రమే ఉంటుంది. జీవశాస్త్రంలో సూక్ష్మ క్రిమి ఉంది కానీ, అది బ్యాక్టీరియానే. అతి సూక్ష్మ క్రిమి, విష క్రిమి, అతిచిన్న విష క్రిమి అని విశేషణం తగిలించి వాడుతున్నాం తప్ప తెలుగులో ఏది బ్యాక్టీరియా? ఏది వైరస్? అన్న విభజనలోకి వెళ్ళలేదు. బ్యాక్టీరియాకు సూక్ష్మ క్రిమి, అతి సూక్ష్మ క్రిమి మాట సరిపోతుంది- అది జీవకణం కాబట్టి. వైరస్ ను తెలుగులో వైరస్ అని యథాతథంగా వాడడమే ఉత్తమం. ఎందుకంటే వైరస్ జీవకణం కాదు కాబట్టి క్రిమి, లేదా సూక్ష్మక్రిమి అన్న మాట అన్వయం కానే కాదు. మన పత్రికలవారు వైరస్ కు పదహారణాల తెలుగు అనువాదంలో ఇంకా నామకరణం చేసినట్లు లేరు. లేక చీకటి చిట్లిన ఇంగ్లీషు కీకారణ్యంలో తెలుగు నిఘంటువుల పదాల టార్చ్ లైట్లు తీసుకుని అర్థాల కిరణాల అన్వేషణలో ఉన్నారేమో తెలియదు.

 

అయినా- భాషలో వైరస్ మాట ఉంటుందేమో కానీ…వైరస్ కు భాష ఉండదు. వైరస్ వైరాలజీగా దానికదిగా అదే ఒక భాష!

తెలుగుకు వైరస్ తెగుళ్లు, చీడ పీడలు ఉండవచ్చు కానీ…తెలుగు భాషలో “వైరస్” కు మాటే లేదు.

కరోనా ఇకపై విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబుల్యు హెచ్ ఓ అధికారికంగా ప్రకటించింది. అంటే కరోనా పూర్తిగా పోలేదు. ఇప్పట్లో పోనే పోదు. విపత్తు కాకుండా పోయింది- అంతే. సాధారణ జలుబులా ప్రపంచాన్ని పట్టుకుని అలాగే ఉంటుంది.

ముప్పును తెచ్చిందెవరు?
తప్పెవరిది?
శిక్ష అనుభవించింది ఎవరు?

ఎవరిది నేరం?
ఎందుకు జరిగింది ఘోరం?

కరోనా రాకపోయినా…ఆ భయానికే ఆగిపోయిన గుండెలు ఎన్ని?
కరోనా కాకపోయినా కరోనాలో పోయిన ప్రాణాలెన్ని?

ఏ ప్రపంచం చెప్పాలి ఈ లెక్కలు?
ఏ ఆరోగ్య సంస్థ విప్పాలి ఈ చిక్కులు?

చీమయినా దూరకుండా కట్టడి చేసిన లాక్ డౌన్లు…
ముక్కు మూసిన మాస్కులు…
విమానాల్లో ఆగమేఘాల మీద తెప్పించుకుని…పొడిపించుకున్న రెమెడిసివర్లు…
మనిషిని మనిషిని దూరం పెట్టిన సామాజిక దూరాలు…
ప్రథమ, ద్వితీయ, తృతీయ బూస్టర్ డోసులు…
కరోనా పేరుతో రాత్రికి రాత్రి లక్షల కోట్లను పోగేసుకున్న ఫార్మా కంపెనీలు…
శ్మశానాల్లో బూడిద కావడానికి బుద్ధిగా క్యూలో నిరీక్షించిన శవాలు…
అయినవారి అంత్యక్రియలు కూడా చేయలేక విలపించిన హృదయాలు…
మళ్లీ రాకూడదు. రానే రాకూడదు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్