Heart Touching Songs: మనసును తట్టిలేపి పాట వెంట పరుగులు తీయించిన గాయకులలో ఒకరిగా కెకె గురించి చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఆయన హఠాత్తుగా అస్వస్థతకి గురికావడం .. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లేలోగా చనిపోవడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఈ వార్త కదిలించివేసింది .. కన్నీళ్లు పెట్టించింది. కెకె పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాత్. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే పాటే ఆయన లోకం .. పాటనే ఆయన ప్రాణం అనే విషయం అర్థమవుతుంది. ఉరకలేసే ఉత్సాహంతో పాడుతూ, పాటను పరుగులు తీయించడం ఆయన ప్రత్యేకత అనే విషయం అర్థమవుతుంది.
బాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు .. అయితే కెకె స్పెషాలిటీనే ఆయనను యూత్ కి చేరువ చేసింది. యూత్ ను లక్ష్యంగా చేసుకుని వదిలే ఆయన పాటలు వాళ్లని ఒక ఊపు ఊపేసేవి. ఒక్క హిందీలో మాత్రమే కాదు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. మారాఠీ .. గుజరాతీ భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. ఆయన ఎక్కువగా పాడింది హుషారైన పాటలే .. హుషారెత్తించే పాటలే. ధనవంతులు జరుపునే వేడుకల్లో పాడటానికి నిరాకరించే ఆయన, సామాజిక సేవలో భాగంగా ట్రస్టులు నిర్వహించే ఈవెంట్స్ కోసం పాడటానికి ఉత్సాహంగా ముందుకురావడమనేది ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
తెలుగులో ఆయన చాలా పాటలు పాడారు. ‘ ప్రేమదేశం’లోని కాలేజ్ స్టైల్లే .. ‘హలో డాక్టర్’ పాటలు అప్పట్లో దుమ్మురేపేశాయి. ఇక ‘ఖుషీ’ సినిమాలో యే మేరా ఏ జహా’ సాంగ్ యూత్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ‘మల్లీశ్వరీ’ సినిమాలోని ‘చెలి సోకు లేత చిగురాకు’ .. ‘ఘర్షణ’ సినిమాలోని ‘చెలియా .. చెలియా’ .. ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా’ పాటలు సింగర్ గా కెకె ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయనేది చెబుతాయి. ఇలా ‘జల్సా’ .. ‘మున్నా’ .. ‘ హ్యాపీ’ ‘సైనికుడు’ సినిమాలలోను ఆయన హిట్ సాంగ్స్ పాడారు. ప్రతి మనసు మైదానంలో తన పాటల పావురాయిని ఎగరేశారు. పాటకి ఉత్సాహంతో ఉత్సవాలు జరిపించిన ఆ గాయకుడికి నివాళులు అర్పిద్దాం! అభిమాన నీరాజనాలు సమర్పిద్దాం!!