Friday, November 22, 2024
Homeసినిమాసాహసాల బాటలో.. ప్రయోగాల ప్రయాణం

సాహసాల బాటలో.. ప్రయోగాల ప్రయాణం

(మే 31, కృష్ణ జన్మదినం – ప్రత్యేక వ్యాసం)

తెలుగు తెరపై ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత చెప్పుకునే పేరు ఘట్టమనేని కృష్ణ. హీరో అంటే ఇలా ఉండాలనే కొలతలు ఏవైనా ఉంటే, వాటికి సరిగ్గా సరిపోయే కథానాయకుడిగా ఆయన కనిపిస్తారు. మంచి హైటూ .. రంగు .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆకర్షణీయమైన రూపంతో ఆయన తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలేశారు. విశాలమైన కళ్లు ..  చక్కని నాసికతో ఎంత క్లోజప్ షాట్ లోనైనా ఆయన చాలా అందంగా కనిపించేవారు. ఇక రూపానికి తగిన స్వరం ఆయన సొంతం.

ఒక వైపున ఎన్టీఆర్ తన విశ్వరూప విన్యాసం చేస్తుంటే, మరో వైపున ఏఎన్నార్ రొమాంటిక్ హీరోగా దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, తొలిసారిగా వారిద్దరికీ గట్టిపోటీ ఇచ్చిన కథానాయకుడు కృష్ణనే. అయితే తేనె మనసులు’ సినిమాతో కృష్ణ హీరోగా పరిచయం అయినప్పుడు, ఆయన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లకు పోటీ ఇచ్చే స్థాయికి దూసుకువస్తాడని ఎవరూ అనుకోలేదు. అంచనాలను తలక్రిందులు చేయడమనేది ఆయన ఆరంభం నుంచే చూపిస్తూ వచ్చారు.

‘తేనె మనసులు’ హిట్ అయిన తరువాత కృష్ణ చేసిన గూఢచారి 116′ సినిమా, యాక్షన్ హీరోగా కృష్ణను నిలబెట్టేసింది. ఇక అప్పటి నుంచి యాక్షన్ సినిమాలకు కృష్ణ పేరు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ నేపథ్యంలోని సినిమాలను ఆయన ఎక్కువగా చేస్తూ వెళ్లారు. పంచెకట్టుతో పల్లెటూరి బుల్లోడుగా ఆయనను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన శోభన్ బాబు – కృష్ణంరాజుల నుంచి కూడా గట్టిపోటీని ఎదుర్కోవలసి వచ్చింది.

అయితే కృష్ణ ధైర్యంగా పోటీని ఎదుర్కుంటూ ముందుకు దూసుకెళ్లారు. పై హీరోలందరితోను మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వెళ్లారు. రోజుకు మూడు షిఫ్టులలో పనిచేస్తూ ఇతర హీరోలకంటే ఎక్కువ సినిమాలు విడుదలయ్యేలా చూసుకున్నారు. అప్పట్లో కృష్ణకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమా విడుదలైతే చాలు .. థియేటర్ల దగ్గర జాతర జరుగుతున్నట్టుగా ఉండేది. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .. వాళ్ల ఆదరాభిమానాలను అందుకున్నారు. శ్రీదేవి .. జయసుధ .. జయప్రద ఈ ముగ్గురూ కూడా ఆయన సరసన హిట్ పెయిర్ అనిపించుకోవడం విశేషం.

తెరపై ఉద్యమభరితమైన పాత్రలు .. ఆవేశపూరితమైన పాత్రలను ఎక్కువగా చేసిన కృష్ణకిసినిమానే లోకం .. సినిమానే సర్వం. సినిమా తప్ప ఆయనకి మరో ధ్యాస ఉండేది కాదు. ఆయనకి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎన్ని పేజీల డైలాగ్ నైనా సింగిల్ టేక్ లో చెప్పడం .. డబ్బింగ్ ను కూడా అంతే స్పీడ్ గా పూర్తిచేయడం ఆయన ప్రత్యేకత. నిర్మాతలకు అందుబాటులో ఉంటూ మూడు షిఫ్టులలో ఆయన పనిచేసేవారు. అందువల్లనే ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు కూడా కాకముందే 100 సినిమాలను పూర్తి చేయగలిగారు. దీనిని బట్టి కృష్ణ ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.

కృష్ణ ఎంతటి సున్నితంగా కనిపిస్తారో .. మానసికంగా ఆయన అంతటి బలంగా ఉంటారు. తాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడమంటూ జరిగితే, ఇక దానిని ఎలాంటి పరిస్థితుల్లోను మార్చుకునేవారు కాదు. తాను అనుకున్న పనులను పూర్తిచేసే విషయంలో ఆయన దూకుడుగానే ఉండేవారు. భయం .. వెనకడుగు వేయడం అనేవి కృష్ణకి అసలు పరిచయమేలేని పదాలు అని సన్నిహితులు చెబుతారు. అందువల్లనే ఆయన ఎన్నో సాహసాలు .. మరెన్నో ప్రయోగాలు చేయగలిగారు. వీలైనన్ని విజయాలను సొంతం చేసుకోగలిగారు. అలాంటివాటిలో ‘పద్మాలయ స్టూడియో’ నిర్మాణం ఒకటి.

సొంత స్టూడియోను .. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న కృష్ణ, నిర్మాతగా చూపిన దూకుడు చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే తెలుగులో తొలి జేమ్స్ బాండ్ మూవీ (గూఢచారి 116) .. తొలి కౌబోయ్ మూవీ (మోసగాళ్లకు మోసగాడు) చేసిన ఆయన, నిర్మాతగా తొలి సినిమా స్కోప్ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ .. తొలి 70MM సినిమాగా ‘సింహాసనం’ చేయడం విశేషం. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ‘సింహాసనం’ సినిమా దర్శకత్వ బాధ్యతను కృష్ణ చేపట్టడం విశేషం.

ఇలా కృష్ణ కథాకథనాల పరంగాను .. సాంకేతిక పరంగాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నటుడిగానే కాకుండా భారీ చిత్రాల నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సింహాసనం’తో దర్శకుడిగాను తన సత్తా చాటుకున్నారు. 300 సినిమాలకి పైగా చేసిన కృష్ణ, ఆ తరువాత రాజకీయాలలోను చురుకైన పాత్రను పోషించారు. ఎంతోమందికి ఎన్నో రకాల  సహాయ సహకారాలను అందించిన మంచి మనిషిగా, అజాతశత్రువుగా ఆయనకి పేరు ఉంది. ఆయన అందించిన సేవలకుగాను ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఈ రోజున ఆయన జన్మదినం .. ఈ సందర్భంగా ఆయనకి  శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం.

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్