Ramesh Babu died: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పటల్ కి తరలించారు. అయితే.. అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు.
1965లో జన్మించిన రమేష్ బాబు తండ్రి కృష్ణ వారసుడుగా చిన్నప్పుడే తెరంగేట్రం చేశారు. రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు సినిమాతో సినిమాల్లో ప్రవేశించారు. ఆతర్వాత మోసగాళ్లకు మోసగాడు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో చిన్నప్పటి పాత్రల్లో నటించారు. 14 ఏళ్ల వయసులో దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయోగాత్మక చిత్రం నీడలో రమేష్ బాబు లీడ్ రోల్ పోషించారు. అందులో తొలిసారిగా మహేష్ బాబు కూడా కనిపిస్తారు.
ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో రమేష్ బాబు హీరోగా పరిచయం అయ్యారు. ఆతర్వాత బజారు రౌడీ, చిన్నికృష్ణుడు, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, అన్నా చెల్లెలు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్ కౌంటర్ వంటి చిత్రాల్లో నటించారు. ఆతర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2004లో కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాపించి తమ్ముడు మహేష్ బాబు హీరోగా అర్జున్ చిత్రాన్ని నిర్మించాడు. ఆతర్వాత యుటీవీతో కలిసి అతిథి చిత్రాన్ని నిర్మించారు.
ఆతర్వాత దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేష్ బాబు భార్య పేరు మృదుల. ఆయనకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. అయితే.. రమేష్ బాబు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.