Mini Review: రజనీకాంత్ అంటే స్టైల్ .. స్టైల్ కి పర్యాయపదం రజనీకాంత్. ఆయనకి సంబంధించి ఈ రెండింటినీ వేరు చేసి చూడాలేం. ఆయన నుంచి ఈ రోజున థియేటర్లకు వచ్చిన సినిమానే ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగినట్టుగానే ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. టైటిల్ ను బట్టి ఈ కథ ‘జైలు’ చుట్టూ .. ‘జైలర్’ చుట్టూ తిరుగుతుందని ప్రేక్షకులు అనుకోవడం జరుగుతుంది. కానీ అందుకు సంబంధించిన సీన్స్ నిడివి చాలా తక్కువ .. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది.
మరి కథ అంతా ఏ అంశం చుట్టూ నడుస్తుంది అనే సందేహం కలగడం సహజం. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న తన కొడుకు కనిపించకపోవడంతో, హీరో వెతకడం మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలోనే ఇక తన కొడుకు లేడనే విషయం అతనికి తెలుస్తుంది. ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ తన కొడుకుని చంపేసిందని భావిస్తాడు. తండ్రిని పోగొట్టుకున్న తన మనవడికి తానే రక్షణగా నిలబడాలని భావిస్తాడు. అయితే ఆ పిల్లాడిని కూడా చంపేస్తామని హెచ్చరిస్తూ ఆ గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. ప్రమాదం గుమ్మంలోకి రాకపోందే వీధిలోకి వెళ్లి దానిని ఎదుర్కోవాలనే కసితో హీరో బరిలోకి దిగుతాడు.
ఇలా హీరోకి .. విలన్ కి మధ్య వార్ జోరు పెరుగుతూ పోతుంది. ఫస్టాఫ్ ఉన్నంత పెర్ఫెక్ట్ గా సెకండాఫ్ ఉన్నట్టుగా అనిపించదు. సెకండాఫ్ లో కొన్ని లూజ్ సీన్స్ కనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ దగ్గర పడుతుండగా రివీల్ చేసే ట్విస్టులు మళ్లీ కథను బ్యాలెన్స్ చేస్తాయి. రజనీ తన స్టైల్ తో మరోసారి విశ్వరూపం చూపించాడు. ఇక విలన్ వినాయకన్ ను చూస్తే, ఈ మధ్య కాలంలో ఈ తరహాలో విలనిజాన్ని ఎవరూ డిజైన్ చేయలేదేమో అనిపిస్తుంది. కామెడీతో కవర్ చేసినప్పటికీ, తెరపై తుపాకీ మోతలు … కత్తుల చప్పుళ్లు .. రక్తపుధారలు ఎక్కువే అని చెప్పాలి. ఓవరాల్ గా తేల్చాలంటే హిట్ బుట్టలోనే దీనిని వేయాలి.