Sunday, January 19, 2025
HomeTrending Newsమిర్చి రైతులను ఆదుకోవాలి -సీతక్క

మిర్చి రైతులను ఆదుకోవాలి -సీతక్క

ఎకరాన లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి, మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళకి భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రైతుల వద్దకు వెళ్లి ధైర్యం కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్క భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలోని మిర్చి పంటలను ఈ రోజు పరిశీలించారు. ఇద్దరు రైతుల  ఆత్మహత్య చేసుకున్నారని, తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివిధ గ్రామాల్లో మిర్చి తోటలను పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే వరకు వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా సీతక్క అన్నారు.  టేకుమట్ల మండలంలో సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన రవీందర్రావు మిర్చి రైతు మిర్చితోటలో, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అలాగే గుమ్మడవెల్లి గ్రామంలో దళిత రైతు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్న్నారు.

రైతులు చనిపోతుంటే ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబరాలు చేస్తున్నారని, ఎక్కడ రైతులు సంతోషంగా లేరు, మిర్చి పంటలు పోయి, వరి పంట పండిస్తే సకాలంలో కొనక వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులను తరుగు పేరుతో ఒక బస్తా మూడు నుండి నాలుగు కిలోలు, ఒక క్వింటాలుకు 10 నుండి 12 కిలోల కోత విధిస్తూ మిలర్లతో ప్రభుత్వం కుమ్మకై, నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం రైతుల రక్తం తాగే ప్రభుత్వమన్నారు. వందల ఎకరాలు ఉన్న నాయకులకు లక్షలలో కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబరాలు అంటున్నారని, దీన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతు సంబరాలు బంద్ చేసి రైతు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులకు ఆత్మస్థయిర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి, ప్రభుత్వం తరఫున మిర్చి రైతులకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ శ్రీకాంత్, మాజీ సర్పంచులు పెరుమండ్ల లింగయ్య, రాజమౌళి, కృష్ణారెడ్డి, మండల నాయకులు నారాయణ రావు, బండి రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు మధుకర్ విగ్నేష్ అనీల్ గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు రైతులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్