ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న బెంచ్ లో 6:1తో వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ నాథ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ పంజక్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలు వర్గీకరణను సమర్ధించగా…. జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం వర్గీకరణ ప్రతిపాదనతో విభేదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరుసగా మూడురోజులపాటు వాదనలు విన్న రాజ్యంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
వర్గీకరణపై ఈవీ చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసును గతంలో విచారించిన సుప్రీంకోర్టు… ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004 నవంబర్ 5న ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. నాటి నిర్ణయాన్ని నేడు సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. వర్గీకరణ సమర్ధనీయమేనని కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకు నిర్ణయం తెలియజేసింది.
తీర్పులో ముఖ్యాంశాలు:
- ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలదే
- వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు కానీ రాజకీయ రంగు పులుముకోకుండా చూసుకోవాలి
- విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం
- వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదు
- ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్ ను గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానం తీసుకురావాలి
- పార్లమెంట్ కు మాత్రమే వర్గీకరణచేసే అధికారం ఉందన్న ఉషా మెహ్రా కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధర్మాసనం
- ఎస్సీల్లో కొత్తగా ఏదైనా కులాలను చేర్చే అధికారం మాత్రమే పార్లమెంట్ కు ఉందన్న ధర్మాసనం