Tuesday, January 28, 2025
HomeTrending Newsబుల్డోజ‌ర్ న్యాయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

బుల్డోజ‌ర్ న్యాయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా బుల్డోజ‌ర్ న్యాయం పేరుతో జ‌రుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  క్రిమిన‌ల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి ఇంటిని ఎలా బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. పిటీష‌న‌ర్ త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది దుశ్యంత్ దావే కోర్టులో వాదించారు. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బుల్డోజ‌ర్ చ‌ర్య‌ల‌ను ఆపాల‌ని  పిటీష‌న్‌లో కోరారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఇటీవలి కూల్చివేత చర్యలను సవాలు చేస్తూ రెండు అత్యవసర పిటీష‌న్‌ లను సుప్రీంకోర్టు  ఈ రోజు విచారించింది. రాజస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్. మధ్యప్రదేశ్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ లు ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ పిటీష‌న్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్ విచారణ సందర్భంగా గంభీరమైన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స‌మాధానం ఇచ్చారు.

ఒక వ్య‌క్తి నేరంలో నిందితుడిగా ఉన్నంత మాత్రాన, అత‌ని స్థిరాస్తిని నేల‌మ‌ట్టం చేసే అధికారం ఎవ‌రికీ లేద‌న్నారు. ఒక‌వేళ క‌ట్ట‌డం అక్ర‌మమైతే, అప్పుడు మాత్ర‌మే దాన్ని కూల్చివేయ‌డం జ‌రుగుతుంద‌ని తుషార్ చెప్పారు. ఇలాంటి సంద‌ర్భంలో కొన్ని మార్గద‌ర్శ‌కాలు ఇస్తామ‌ని, దోషి అయినంత మాత్రాన ఆ వ్య‌క్తి ఇంటిని ఎలా కూల్చుతార‌ని జ‌స్టిస్ గ‌వాయి ప్రశ్నించారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఎందుకు సూచ‌న‌లు చేయ‌డం లేద‌ని జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ ప్ర‌శ్నించారు. ముందు నోటీసు ఇవ్వాల‌ని, వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాల‌ని, కోర్టు ద్వారా ప‌రిష్క‌రించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత కూల్చివేత ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ తెలిపారు. అక్ర‌మ నిర్మాణాల‌ను ధ‌ర్మాస‌నం స‌మ‌ర్థించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. అక్రమార్కుల నిర్మాణాల కూల్చివేతలకు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాలని  సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్