Thursday, June 5, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆయన నేస్తం అట్లాస్ సైకిల్

ఆయన నేస్తం అట్లాస్ సైకిల్

‘సైకిల్ పై వన్నెలాడి పోతున్నది … రివ్వుమని పిట్టలాగా పోతున్నది…’ 60 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాపాట మాత్రమేకాదు. సైకిల్ పై వెళ్లే వారిని చూడగానే అప్రయత్నంగా నోటి వెంట వస్తుంది.
చిన్నతనంలో మూడుచక్రాల సైకిల్… తర్వాత స్కూలుకి, ట్యూషన్ కి, కాలేజీకి గొప్ప స్నేహితుడిలా వెంట ఉంటుంది ఈ వాహనం. శబ్ద కాలుష్యం, పొగ ఉండవు. ఆరోగ్యానికి మిత్రుడు. రకరకాల రంగుల్లో, విభిన్న ఆకృతుల్లో అలరించే పర్యావరణహిత వాహనం. మాములు సైకిల్ అయినా స్పోర్ట్స్ సైకిల్ అయినా నడిపేవారిలో ఒక రకమైన హుందాతనం, ఆరోగ్యం కనిపిస్తుంది. మోటార్ వాహనాల మూలంగా వాడకం తగ్గినా మళ్ళీ ఇటీవల ఫిట్నెస్ స్పృహ పెరగడంతో అందరూ సైకిల్స్ పైన దృష్టి పెడుతున్నారు. ప్రధాన నగరాల్లో సైకిల్స్ కోసం ప్రత్యేక బాట ఏర్పాటు చేస్తున్నారు. అనేక జీవనశైలి రోగాలకు సైకిల్ వ్యాయామం మంచి మందులా పని చేస్తుండటం వల్ల సైకిల్ తొక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైకిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మొదట్లో వందల్లో ఉన్న సైకిల్ ధర ఇప్పుడు బాగా పెరిగిపోయింది. రకరకాల మోడళ్లలో వేలల్లో ధరలు ఉంటున్నాయి. స్పోర్ట్స్ సైకిల్స్ ధర ఇంకాస్త ఎక్కువ. ఇప్పటికీ సైకిల్ యాత్రలకు వెళ్లే పర్యావరణ ప్రేమికులూ ఉన్నారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా సైకిల్ విడువని ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయనే సూరత్ కి చెందిన సురేష్ జరీవాలా. 30 ఏళ్లుగా సురేష్ జరీవాలా జీవితంలో భాగమైంది సైకిల్. సూరత్ కు చెందిన సురేష్ తన అట్లాస్ పాత సైకిల్ పైన రోజూ సుమారు 20 కిలోమీటర్లు తిరుగుతారు. అది తన జీవితంలో ఒక భాగం అనే జరీవాలా ఇంటిపెరట్లో అనేక కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు బారులు తీరి ఉంటాయి.

సూరత్ వ్యాపార వర్గాలు ఆయన్ని సైక్లింగ్ లెజెండ్ అంటాయి. మొదట్లో ఫ్యాక్టరీ సూరత్ లో ఉన్నప్పుడు సైకిల్ పై ప్రారంభమైన ప్రయాణం తర్వాత అంకలేశ్వర్ కి ఫ్యాక్టరీ మారాక కూడా కొనసాగింది. ఉదయం 5.45 కల్లా లేచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడీయన. అలా 1972 నుంచీ చేయడం మాములు విషయం కాదు. సూరత్ స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరం ఆయన ఇల్లు. సైకిల్ పై వెళ్లి ట్రైన్ ఎక్కి అంకలేశ్వర్ వెళ్లి, అక్కడ స్టేషన్ లో ఉన్న మరో సైకిల్ ఎక్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీ కి వెళ్తారు. మళ్ళా అలాగే తిరిగి వస్తారు. 1990 లో కొన్న అట్లాస్ సైకిల్ ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. బంధుమిత్రులు అందరూ ఆయన స్ఫూర్తిని ప్రశంసిస్తారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్దామా మరి!
( ఇవాళ వరల్డ్ సైకిల్ డే)

RELATED ARTICLES

Most Popular

న్యూస్