సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన మార్కు ఆటతో చెలరేగి ఆడడంతో శ్రీలంకతో జరుగుతున్న మూడో టి 20 లో ఇండియా 91 పరుగులతో ఘన విజయం సాధించి మ్యాచ్ తో పాటు 2-1 తేడాతో సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది.
తొలి రెండు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన సూర్య ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా ప్రతాపం చూపించాడు, 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టి 20ల్లో సూర్య కుమార్ యాదవ్ కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.
రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ విఫలమై కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్-46; రాహుల్ త్రిపాఠి-35; అక్షర్ పటేల్ -21 (నాటౌట్) పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా చెరో నాలుగు పరుగులు మాత్రమే చేశారు.
శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2; రజిత, కరుణరత్నే, హసరంగ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక తొలి వికెట్ కు 44 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోయి16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ శనక-23; ధనుంజయ డిసిల్వా-21 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
ఇండియా బౌలర్లలో ఆర్ష దీప్ సింగ్ 3; కెప్టెన్ హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలా 2; అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
సూర్య కుమార్ యాదవ్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. అక్షర్ పటేల్ ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ సొంతం చేసుకున్నారు.