ICC Rankings: ఇండియన్ సెన్సేషన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గత మూడు వారాలుగా టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ పొజీషన్ లో ఉన్న సూర్య ఈవారం కూడా అదే స్థానం దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్ తో నిన్న ముగిసిన మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిన సూర్య… తన ప్లేస్ కు ఎదురు లేకుండా చూకుసున్నాడు. సూర్య 890పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, పాక్ బ్యాట్స్ మ్యాన్ మహమ్మద్ రిజ్వాన్ 836తో రెండో స్థానంలో ఉన్నాడు. సూర్య-రిజ్వాన్ మధ్య 56 పాయింట్ల తేడా ఉండడం గమనార్హం.
కివీస్ తో టి20 సిరీస్ గెలవడం ద్వారా టి 20ల్లో తన మొదటి ప్లేస్ ను ఇండియా నిలబెట్టుకుంది. 268 పాయింట్లతో ఇండియా మొదటి స్థానంలో ఉండగా, ఇటీవలే టి 20 వరల్డ్ కప్ గెల్చుకున్న ఇంగ్లాండ్ జట్టు 265 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
వన్డేల్లో న్యూజిలాండ్, టెస్టుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, ఈ రెండు విభాగాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
హార్దిక్ పాండ్యా టి20 ఆల్ రౌండర్ కేటగిరి లో షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్); మహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) తరువాత మూడో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో…. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానంలో నిలవగా, రోహిత్ శర్మ తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
టెస్ట్ ల విషయానికొస్తే, బ్యాటింగ్ లో రిషభ్ పంత్ ఐదు, రోహిత్ శర్మ ఎనిమిదో స్థానాలు నిలబెట్టుకున్నారు. టెస్ట్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్ ప్రీత్ బుమ్రా నాలుగో స్థానాలు నిలబెట్టుకున్నారు. టెస్ట్ ఆల్ రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా, అశ్విన్ మూడో ప్లేస్ లో ఉన్నారు.