ఇండియాతో జరిగిన మూడో టి20లో ఇంగ్లాండ్ 17 పరుగులతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ విసిరిన 216 పరుగుల లక్ష్య సాధనలో తొలి మూడు వికెట్లూ త్వరగా కోల్పోయినా… సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లో 14 ఫోర్లు 6 సిక్సర్లతో 117 పరుగులు చేసి ఇండియాను విజయం అంచుల వరకూ తీసుకెళ్ళాడు. కానీ 19వ ఓవర్లో ఐదో బంతికి సూర్య ఔట్ కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
నాటింగ్ హాం లోని ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో డేవిడ్ మలాన్-77 (39 బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) పరుగులతో రాణించాడు. లివింగ్ స్టోన్ 42తో నాటౌట్ గా నిలవగా, ఓపెనర్ జేసన్ రాయ్ 27 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
ఇండియా బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు, ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య సాధనలో బరిలోకి దిగిన ఇండియా 31 పరుగులకే మూడు కీలక వికెట్లు (రిషభ్ పంత్-1; విరాట్ కోహ్లీ-11; రోహిత్ శర్మ-11) కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్- సూర్య కుమార్ యాదవ్ లు నాలుగో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 పరుగులు చేసి శ్రేయాస్ ఔట్ కాగా, దినేష్ కార్తీక్ (6); రవీంద్ర జడేజా (7) నిరాశ పరిచారు. సూర్య అవుట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మళ్ళింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే మూడు, డేవిడ్ విల్లె, క్రిస్ జోర్డాన్ చెరో రెండు, రిచర్డ్ గ్లీసన్, మోయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ బౌలర్ టోప్లేకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, ఇండియా బౌలర్ భువనేశ్వర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : India Vs. England: ఇండియాదే టి 20 సిరీస్