Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసీనియర్ల పైశాచికత్వం

సీనియర్ల పైశాచికత్వం

Say No to Ragging: విద్యలేనివాడు విద్వాంసుచేరుగ నుండగానే పండితుడుగాడు… కొలనిహంసల కడ కొక్కెరలున్నట్టు అంటాడు వేమన.

అలాగే విద్యాలయాలకు వెళ్లినంత మాత్రాన్నే విద్య అబ్బుతుందనీ లేదు… సంస్కారవంతులవుతారని అంతకన్నా లేదు. తానేమిటో తనకు తెలియని తనం.. అసలు తెలుసుకోవాలనే జిజ్ఞాసే లేకపోవడం… అందుకు ఉడుకు వయస్సూ ఓ కారణం కావడం… పైగా అంతా తెలుసన్న తెంపరితనం…వాటికి తోడు సినిమా, టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా, పత్రికలు ఇలాంటివెన్నో తనను తానే కంట్రోల్ చేసుకోలేని ప్రభావిత శక్తులై పని చేయడం… పిల్లలేబాటన పోతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం…పాశ్చాత్య ధోరణుల్లో మత్తుపదార్థాలకలవాటై తమను తాము మర్చి.. తామేం చేస్తున్నామో కూడా సోయిలేని ఓ అచేతన నిద్రావస్థ… తాము హింసిస్తున్నదీ ఓ సాటి వ్యక్తేనన్న ఇంగితం లేని ఉన్మాదం… తామూ అలాంటి దుస్థితి అనుభవిస్తేనని ఎదుటివాడి కోణంలోంచి ఆలోచించలేని మూర్ఖత్వం.. ఇదిగో ఇవన్నీ కలగలిస్తే ఈమధ్య సూర్యాపేటలోని ఓ మెడికల్ కళాశాలలో జడలు విప్పుకున్న ర్యాగింగ్ భూతం ఘటనకు ఓ దృశ్యరూపం.

Suryapeta Medical College Incident

విద్యలేనివాడు వింత పశువైతే ఇంత సానుభూతైనా దక్కుతుందిగానీ… విద్య నేరుస్తున్నవాడే వింత పశువైతే… ? అప్పుడే ఇంటర్
లోంచి జీవితంలోకి ఎంటరై… బెదురుతున్న లేగదూడల వలే మెడికల్ కళాశాలకు వచ్చే జూనియర్స్ ని చేరదీసి ఆదరించి అన్నీ నేర్పాల్సిన వారే.. అచ్చొచ్చిన ఆంబోతుల మాదిరి చెరదీసే సైకిక్ పనులు చేస్తే…? సాటి మనిషి పట్ల మానవత్వం పక్కనబెట్టి… కనీసం జాలి, దయ లేనితనమంటే ఎంతటి కర్కోటకమైన మనసై ఉండాలి…? ఎందులో సీనియర్… ? కాలేజీలో చదువుల్లోనా… చదువులు వల్ల పొందాల్సిన జ్ఞానాన్ని ఒంటబట్టించుకోలేని అజ్ఞానంలోనా… ఆ అజ్ఞానంలో తామేం చేస్తున్నామో సోయి లేని ఆధిపత్య ధోరణిలోనా….? ఇదిగో ఇలా అన్నీ… సమాధానాలు దొరకని ప్రశ్నలే! విద్యనుంచి అందిపుచ్చుకున్న జ్ఞానంతో ఏం కూడదో తెలుసుకోలేని పైశాచిక ధోరణులే ఈ ర్యాగింగ్ భూతాలు!!

సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో… పెరుగుతున్న యువత మానసిక పెడ ధోరణులే ఇప్పుడు చర్చ! అయితే సూర్యాపేట మెడికల్ కళాశాల ఘటనే మొదటిదీ కాదు… చివరిది అంతకన్నా కాదు.. కానీ ఇలాంటివి జరిగిన ప్రతీసారి చర్చించుకునేవిగా మాత్రం మిగిలిపోతున్నవి. పొరపాటు మానవ సహజం కావచ్చు.. కానీ, పొరపాట్లే అలవాటుగా మారి క్షమించరాని నేరాలై.. అవే పునరావృతమవ్వడం మాత్రం క్షమించరాని నేరం! అందుకు సాక్షీభూతమే మరోసారి పంజా విప్పిన ఈ ర్యాగింగ్ రాక్షసత్వం! మరి నిజంగా ర్యాగింగ్ రాక్షసత్వమేనా అంటే.. అతి సర్వత్ర వర్జయేతని.. ఏది శృతి మించినా వాటి పర్యవసానాలెలా ఉంటాయో మరోసారి తెలియజెప్పిన ఘటన ఈ ర్యాగింగ్ కలకలం.

తెలంగాణ సర్కార్ సీరియస్‌గా స్పందించడం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎంఈ రమేష్‌రెడ్డి వేగంగా చర్యలు చేపట్టడం.. హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లికి చెందిన మెడికల్ ఫస్ట్ ఈయర్ స్టూడెంట్ ను ర్యాగింగ్ చేసిన ఘటనలో.. ఏకంగా ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసి… ఏడాది పాటు కళాశాలకే రానివ్వకపోవడం.. ఇవన్నీ జరిగిపోవచ్చునేమో..?! ఓ జూనియర్ ను కనీసం మానవత్వం లేకుండా పిడిగుద్దులతో ఒంటరిని చేసి.. బాదటం.. పైశాచికత్వమే కానీ.. అసలది ర్యాగింగెలా అవుతుంది…? ర్యాగింగ్ ఉండొచ్చు! కానీ, అది జూనియర్స్ లో భయాన్ని పోగేట్టేంత…సెన్సిటివిటీని దాటి లోకాన్ని ఛేదించుకు వెళ్లేలా ఉపయోగపడేంత!! కానీ.. ర్యాగింగ్ పేరుతో.. ఇలా పైశాచికత్వానికి పాల్పడితే జరిగిందేంటి…?చివరకు మిగిలిందేంటి…? కోటి ఆశలతో మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కళాశాలకు వచ్చిన లేత మనసులో.. తన సీనియర్స్ అంటేనే హేయమైన భావం నిండేందుకు ఈ ర్యాగింగ్ కారణం కాలేదా…? తన కంటే సీనియర్స్ గా… ఓ అన్నల్లా, గురువులనడగలేని సందేహాలను తీర్చే గైడ్స్ లా ఉపయోగపడి.. మనసుల్లో నిల్చిపోవాల్సిన వాళ్లు… ర్యాగింగ్ పేరుతో పైశాచికత్వం ప్రదర్శించి.. లేత వయస్సులో ఓ భీతి కల్గించి.. చదువు మీద… కళాశాలల కల్చర్ మీద ఓ వెగటు భావనకు కారకులు కావడమేనా.. అంతిమ లక్ష్యం..? ఏ పనికైనా ఓ మోటో ఉంటుంది.. ఓ లక్ష్యముంటుంది. అది ర్యాగింగైనా.. జాగింగైనా..సింగింగైనా! కానీ.. ఇదిగో సూర్యాపేట ర్యాగింగ్ ఘటన మాదిరి ఓ లక్ష్యం.. మోటో లేని పనులతో కలిగే అనర్థాలకు బలయ్యేదెవరూ..? పాల్పడ్డందుకు వాళ్లూ.. వాళ్లతో పాటు కాలేజంటేనే అసహ్యం కల్గిన బాధితుడూను!

ఏమైంది చివరకు…?.ర్యాగింగ్ కు పాల్పడ్డ ఆరుగురిని హాస్టల్ నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఓ ఫస్ట్ ఈయర్ చదువుతున్న విద్యార్థి‌ని దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి.. దుస్తులు విప్పించి.. సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు.. దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి ఆరోపించే పరిస్థితంటే… ఎంత తీవ్రమైన మనస్తత్వముంటే ఇలాంటి ఘటనలకు పాల్పడుతారు..? ఇలాంటివి వచ్చినప్పుడు.. ఎవడి బాధ వాణిది. కోట్ల రూపాయలతో పెట్టుకున్న కాలేజ్.. బద్నాం ఐపోతుందనే బాధతో.. జరిగిందాన్ని వక్రీకరించేందుకు యాజమాన్యాల యత్నం.. అయ్యో కోట్ల రూపాయల డొనేషన్స్ కట్టి కాలేజ్ కు పంపి హాస్టల్లో ఉంచితే ఇలా చేశారేంట్రా అని నిందితుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు.. అబ్బాయినెలాగైనా వైద్యుడిని చేయాలని కోట్లు పెట్టి కళాశాలలో, హాస్టల్ లో చేర్పిస్తే.. ఈ మాత్రం భద్రత లేదానన్నది బాధితుడి తల్లిదండ్రుల వెర్షన్… ఇలా ఒక్క ర్యాగింగ్ ఘటన ఎన్ని అనర్థాలకు హేతువవుతోంది..?

అందుకే విద్య విజ్ఞానాన్నే కాదు.. కూసింత సంస్కారాన్ని.. విచక్షణనూ కూడా ఇస్తూనే.. విర్రవీగే ఉడుకు వయస్సులో ఇంగితాన్ని కోల్పోకుండా కూడా చేయగల్గాలి. అలా కావాలంటే విద్యార్థులు, వారిని ఓ కంట కనిపెట్టే తల్లిదండ్రులు, కళాశాలలో గురువులు, హాస్టల్ లో సంరక్షకులు.. ఇలా అందరూ బాధ్యతగా వ్యవహహరించినప్పుడే.. ఇలాంటి ఘటనలనే ఉదాహరణలుగా కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించినప్పుడే సాధ్యమయ్యే పని!

-రమణ కొంటికర్ల

Also Read :

చెడులో చెడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్