తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపి ఒక్కసారిగా ఎండలోకి రావడం.. లేదంటే 40 డిగ్రీల మండే ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఏసీ గదుల్లోకి వెళ్లవద్దని చెబుతున్నారు. మరి కొందరు తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం సరికాదని.. శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల వల్ల అది వడదెబ్బకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఎండ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు గది వాతావరణంలో గడపాలని.. అప్పుడే ఏసీ గది లేదంటే స్నానానికి వెళ్లాలని చెబుతున్నారు. ఎండ వల్ల ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోత తప్పదు. ఇలాంటి సమయంలో శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. ఇంట్లోనే ఉన్నామనే ఉద్దేశంతో చాలామంది ద్రవాలు తీసుకోరు. ఫలితంగా శరీరంలోని నీరంతా బయటకు పోయి చివరికి ఇదే వడదెబ్బకు దారి తీస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం..
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నీడ లేదా చల్లని ప్రదేశానికి రోగిని తరలించాలి. చల్లని నీటితో స్పాంజ్, ఐస్ ప్యాక్‌లు లేదా నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్‌లో తుడిచి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వదులుగా ఉండే, తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించాలి. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 3 గంటలలోపు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిది. ఉప్పు కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ లాంటి ద్రావణాలు, ఎక్కువ నీటి శాతం ఉండే పండ్లను తీసుకోవాలి.