పాకిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి.. కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల పాటు మరో ఏడుగురు చనిపోయారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వహాబ్ సిద్ధిఖీ ఓ ప్రకటనలో తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను చంపడంతో ఆపరేషన్ ముగిసిందని ఆయన పేర్కొన్నారు.
పోలీసు దుస్తులు ధరించిన తాలిబాన్ సాయుధులు శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీస్ ప్రధాన కార్యాలయ భవనం వెనుక నుంచి దాడి చేశారు. ముందు గేటు నుంచి ఇద్దరు గ్రనేడ్లు విసురుతూ లోనికి ప్రవేశించారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిని పారామిలటరీ రేంజర్లు, పోలీసులు ప్రతిఘటించారు. ఇరు వైపులా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు, మరో నలుగురు మృతి చెందారు.
ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక రేంజర్ మరియు ఒక శానిటరీ వర్కర్‌తో సహా నలుగురు మరణించారు. దాడి జరిగిన సమయంలో ఉన్నత అధికారులు కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ప్రతినిధి వాట్సాప్ సందేశం ద్వారా ఈ దాడికి బాధ్యత వహించాడు. మా ముజాహిదీన్ అమరవీరులు కరాచీ పోలీసు కార్యాలయంపై దాడి చేశారు అని అతడు ట్వీట్ చేశాడు. ఈ దాడి నేపథ్యంలో కరాచీలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హింసను అణిచివేస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యం అని అన్నారు. పోలీసులు ఉన్నతాధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.