పాకిస్తాన్ లో తాలిబాన్ కదలికలు పెరిగాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్ లకు మద్దతుగా క్వెట్టా నగరంలో వందలమంది యువకులు వాహనాలతో ర్యాలి నిర్వహించారు. ప్రదర్శనకారులు నగరం మొత్తం కలియ తిరుగుతున్నా పాక్ పోలీసులు, అధికార యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వాహనాల ర్యాలి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. క్వెట్టా లోని ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి సమీపంలోనే ప్రదర్శనకారులు విచ్చలవిడిగా తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇంత జరుగుతుంటే ఆఫ్ఘన్ వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోకూడదని పాకిస్తాన్ మంత్రులు అంటున్నారు.
ఆఫ్ఘన్ లోని తాలిబాన్ లతో పాకిస్తాన్ ప్రభుత్వానికి బలమైన సంబంధాలు ఉన్నాయని ఎంపి మొహసిన్ దావర్ ఆరోపించారు. క్వెట్టాలో ప్రదర్శనలు ఇందుకు బలమైన సాక్ష్యమన్నారు. ఆఫ్ఘన్ సైనికుల కాల్పుల్లో చనిపోయిన తాలిబాన్ ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలు పాకిస్తాన్ చాలా చోట్ల జరుగుతున్నాయి. తాలిబాన్ ఉగ్రమూకలతొ పాకిస్తాన్ కు స్నేహం ఉందని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి కుడా ఓ కార్యక్రమంలో నర్మగర్భంగా ఒప్పుకున్నారు. తాలిబాన్ ల కుటుంబాలు ఎక్కువగా ఖైభర్ పఖ్తుంక్వా రాష్ట్రంలోని క్వెట్టా, పెషవార్ తదితర నగరాలతోపాటు ఇస్లామాబాద్ లో ఎక్కువగా ఉన్నారు.
అమెరికాతో తాలిబాన్ చర్చల సమయంలో ఉగ్ర నేతలు తమ కుటుంబాల్ని కలిసేందుకు పాకిస్తాన్ కు ఎక్కువగా వచ్చేవారు. అదే సమయంలో చర్చల్లో అనుసరించే వ్యూహంపై పాక్ పాలకులను కలిసి ఉగ్ర నేతలు సలహాలు, సూచనలు స్వీకరించేవారు. రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు తాలిబాన్ లకు మద్దతు ఇస్తున్న పాక్ పాలకులు ఎదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.