Friday, September 20, 2024
HomeTrending Newsతెలంగాణకు తమిళ గవర్నర్లు

తెలంగాణకు తమిళ గవర్నర్లు

తమిళనాడు రాష్ట్రానికి తెలంగాణ రాజ్ భవన్ కు అవినాభావ సంబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఆశ్చర్యకరంగా రాజ్‌భవన్‌లో గత 15 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా తమిళులే కొనసాగుతున్నారు. గవర్నర్ గా పనిచేసిన.. పనిచేస్తున్న ముగ్గురు గవర్నర్లు (ESL నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, CP రాధాకృష్ణన్) తమిళనాడుకు చెందినవారు కావటం గమనార్హం.

తాజాగా సిపి రాధాకృష్ణన్ కొత్త గవర్నర్ గా (బుధవారం మార్చి 20న సోమాజిగూడలోని రాజ్‌భవన్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు) నియామకంతో తమిళ తెలంగాణ సెంటిమెంట్ మరోసారి రుజువైంది.

2009లో ESL నరసింహన్‌ మొదట నియామకం అయ్యారు. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ పదవిని నిర్వహించారు. విభజన తర్వాత మరో ఐదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ రాజ్యాంగ అధిపతిగా కొనసాగారు. AP బాధ్యతల నుండి నరసింహన్‌ను రిలీవ్ చేస్తూ APకి 2019 జూలైలో కొత్త గవర్నర్ (బిశ్వభూషణ్ హరిచందన్) కేంద్రం నియమించింది.

నరసింహన్ జులై 2019 నుండి సెప్టెంబర్ 2019 వరకు మరో మూడు నెలల పాటు తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. ఆ తర్వాత ఆయన స్థానంలో మరొక తమిళియన్ (డాక్టర్ తమిళిసై సౌందరరాజన్) గవర్నర్ గా వచ్చారు. తమిళిసై సెప్టెంబర్ 8, 2019 నుండి మార్చి 19, 2024 వరకు గవర్నర్‌గా పనిచేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  ఆమె పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణకు కొత్త గవర్నర్‌గా CP రాధాకృష్ణన్‌ను ప్రకటించారు.

మాజీ IPS అధికారి ESL నరసింహన్‌ (ఎక్కడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్)గా సుపరిచితులు. 1945లో మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. డాక్టర్ తమిళిసై 1961లో తమిళనాడులోని కన్యాకుమారిలో జన్మించారు. కొత్త గవర్నర్ CP రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినవారు. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు బీజేపీ ఎంపీగా ఉన్నారు.

ESL నరసింహన్, తమిళిసై సౌందరరాజన్ ఇద్దరూ సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ తో, తెలంగాణ ప్రజలతో అనుబంధం నెమరువేసుకొంటూ.. మంచి జ్ఞాపకాలను మూటగట్టుకున్నామని వివిధ సందర్భాల్లో వెల్లడించారు. నరసింహన్‌కు దాదాపు పదేళ్ల అనుబంధం ఉండగా, తమిళిసాయి దాదాపు నాలుగున్నరేళ్లపాటు తెలంగాణలో పనిచేశారు. ఆమె 2021 నుండి 2024 వరకు మూడు సంవత్సరాల పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

ESL నరసింహన్, CP రాధాకృష్ణన్ ఇద్దరి మధ్య సారుప్యత ఉంది. చిన్న రాష్ట్రానికి గవర్నర్‌లుగా పనిచేస్తున్నప్పుడు, రాష్ట్రపతి వారికి అదనపు బాధ్యతలను అప్పగించారు. నరసింహన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్ (జనవరి 2007 నుండి)గా ఉన్నపుడు డిసెంబరు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22వ గవర్నర్‌గా నియమితులయ్యారు. రెండు నెలల తర్వాత జనవరి 2010లో ఆయన ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. APకి పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

CP రాధాకృష్ణన్ విషయానికి వస్తే, అతను ఫిబ్రవరి 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌ రావటాన్ని హైదరాబాద్ నగరంలో 5 లక్షలకు పైగా ఉన్న తమిళ ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వడం స్వాగతించదగిన పరిణామమని సామాజిక శాస్త్రవేత్త, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ రాములు అభిప్రాయపడ్డారు.

చారిత్రాత్మకంగా తమిళనాడుకు పూర్వ ఆంధ్రప్రదేశ్‌తో బంధం బలంగా ఉంది. 1940, 50లలో తెలుగు మాట్లాడే ప్రజలు, తమిళుల మధ్య వివాదాలు తలెత్తాయి. మద్రాసు రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య చెన్నై నగరం వివాదానికి దారితీసింది. చివరకు తమిళులకే చెన్నై దక్కింది.

చివరకు ఆంద్ర, నిజాం రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే వారితో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 70 ఏళ్ళ తర్వాత తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరగటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం జరిగింది. ఈ వివాదంపై ఉద్యమాలు జరిగినపుడు… కీలకమైన సమయంలో తమిళ వ్యక్తే గవర్నర్ గా ఉండటం… ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన మరో ఇద్దరు కూడా తమిళులే కావటం యాదృచ్చికం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్