రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో టమాటాను సబ్సిడీపై అందిస్తున్నామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు కూడా అందుబాటులో ధరలు ఉండాలన్నది సిఎం జగన్ ఆలోచన అని మంత్రి పేర్కొన్నారు. టమాటా ధర ఎక్కువైనా, తక్కువైనా ఆదుకుంటామని చెప్పారు. విజయవాడలోని కృష్ణలంక రైతు బజార్ ను మంత్రి సందర్శించి సబ్సిడీ పై టమాటా అందిస్తున్న కౌంటర్లను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి కూరగాయల ధరలపై ఆరా తీశారు.
అనతరం మాట్లాడుతూ అధిక ధరలు ఉన్నతవరకూ సబ్సిడీ కౌంటర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారులకు తాము అందిస్తున్న మేలును తప్పుదారి పట్టించడానికే టిడిపి విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకూ టిడిపి ఎన్ని టన్నుల టమాటా పంచి పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పబ్లిసిటీ కోసం పది కిలోల టమాటాలు తక్కువ ధరకు అమ్మి ఫోటోలకు ఫోజులు ఇస్తే సరిపోదని సూచించారు.