చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఎవరో ఒకరు బురద నీటిని బాటిల్ లో తెస్తే దాన్ని చూపించి ప్రజలకు ఇలాంటి మంచినీరు సరఫరా చేస్తున్నారని బాబు మాట్లాడడం తగదన్నారు. 14ఏళ్ళు సిఎంగా పనిచేసిన వ్యక్తీ ఇలా దిగజారి మాట్లాడడం సమంసజం కాదన్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే అయన పడవల్లో పరమర్శకు వెళ్లారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మీద ఏదో బురదజల్లాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గోదావరికి 26 క్యూసెక్కుల వరద వచ్చిందని. భద్రాచలం వద్ద నీటి మట్టం 70అడుగులకు చేరుకుందని, ఈ ప్రభావం గోదావరి ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఉంటుందని అంచనా వేసి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిందని, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిందని, తాము అక్కడికి రాబోమని చెప్పిన వారికి, కావాల్సిన నిత్యావసరాలు అందించామని వివరించారు. కోనసీమ జిల్లాల్లో వరదలకు ఐదుగురు మరణించారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి చిత్తశుద్దితో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వరద సాయం కోసం సిఎం జగన్ వెంటనే 41 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు.