Saturday, January 18, 2025
Homeసినిమాభయపెట్టడానికి ట్రై చేసిన 'తంత్ర'

భయపెట్టడానికి ట్రై చేసిన ‘తంత్ర’

దెయ్యాలు .. క్షుద్రశక్తుల నేపథ్యంలోని కథలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన సినిమాలు సైతం ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అందువలన ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాల సంఖ్య నిదానంగా పెరుగుతూ వెళుతోంది. ఈ క్రమంలోనే నిన్న ‘తంత్ర’ సినిమా థియేటర్లకు వచ్చింది. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు.

పోస్టర్లతో .. ట్రైలర్ తో ఈ సినిమాపై బజ్ పెరిగింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఈ సినిమా ఈ వారం థియేటర్లలో గట్టిగానే సందడి చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక గ్రామం .. ఆ గ్రామంలోని అందమైన యువతినే మన కథానాయిక రేఖ. క్షుద్రశక్తుల నేపథ్యంలోనే ఆమె పుట్టి పెరుగుతుంది. అందువలన ఆమె చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. క్షుద్రశక్తులను పొందాలనుకున్న ఒక మాంత్రికుడు రేఖను ‘బలి’ ఇవ్వాలని నిర్ణయించుకుని, రంగంలోకి దిగుతాడు.

ఈ క్రమంలోనే రేఖను కథానాయకుడు తేజు ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. ఈ జంట ప్రేమ ఫలిస్తుందా? క్షుద్రశక్తులను పొందాలనే మాంత్రికుడి కోరిక నెరవేరుతుందా? రేఖ చుట్టూ దెయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి? ఇలాంటి పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటపడుతుంది? అనేది కథ. అనన్య నాగళ్లకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విశాలమైన కళ్లతో  ఆమె హావభావాలను చాలా గొప్పగా పలికించింది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం కొంతవరకూ హెల్ప్ చేశాయి. కానీ స్లో నేరేషన్ కారణంగా .. లాజిక్ ను పక్కన పెట్టేయడం వలన నిరాశపరుస్తుంది. బలమైన కథను సిద్ధం చేసుకుని ఉంటే, భయపెట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించేదే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్