Wednesday, June 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం

లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం

Tax fraud By Luxury Car Owners – Luxury cars cruising without life tax in Hyderabad

రవాణా శాఖ మరియు పోలీసు అధికారులకు బహిరంగ ప్రకటన:-

# కోటి, మూడు కోట్లు, ఆరు కోట్ల విదేశీ కార్లు దేశం కాని దేశం నుండి మన దేశంలోకి మా పిల్లలు రహస్యంగా, దొంగతనంగా తెచ్చుకోలేదు. రాజ మార్గంలో నౌకల్లో, విమానాల్లోనే కదా తెచ్చుకున్నాం? అప్పుడు మీరెందుకు పట్టుకోలేదు?

# ఆరు కోట్ల కారు ఇంటూ పద్నాలుగు పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ అంటే ఎనభై నాలుగు లక్షలు కట్టడానికి మేమేమన్నా అమాయకుల్లా కనిపిస్తున్నామా?

# మీకు పిల్లా పాపా లేరా? వారు ఆడుకోవడానికి బొమ్మలు కొనివ్వరా? అలాగే మేము మా పిల్లలు ఆడుకోవడానికి ఆరు కోట్ల కారు కొనిచ్చాము.

# వారు ముచ్చటపడి ఆ కార్లతో ఆడుకుంటూ, అర్ధ రాత్రి మూడొందల కిలో మీటర్ల వేగంతో మెట్రో పిల్లర్లకు ఢీ కొడితేనే కదా…మెట్రో పిల్లర్ల బలం, నాణ్యత, మన్నిక ప్రపంచానికి తెలిసింది!

# తొక్కలో లక్ష రూపాయల పేద కార్లు రోడ్ల మీద వికారంగా తిరుగుతుంటే నాగరికతకు ఎంత అమర్యాద? అదే ఆరు కోట్ల కారు రోడ్డు మీద తిరిగితే ఆ రోడ్డే పొంగి పులకించిపోదా?

# మా పిల్లలు పబ్బులకో, గబ్బులకో, అవుటింగ్ కో వెళ్లాలంటే పది సెకన్లలో రెండు వందల కిలో మీటర్ల స్పీడ్ అందుకునే ఫెరారీలు, లాంబార్గినీలు, బుగాటి వేరన్లు, రోల్స్ రాయిస్ లు, బెంజ్ మేబ్యాక్ లు, బెంట్లీలు, ఆస్టిన్ మార్టిన్లు…ఇంకా నోరు తిరగని అనేకానేక అంతర్జాతీయ బ్రాండ్లు కాక…దిక్కులేని నానోలు, మారుతీలు, హ్యుందాయ్ లు, హొండాలు, టొయోటాలు వాడతారా? వారు వాడతామన్నా మేము వాడనిస్తామా?

# మొన్నటికి మొన్న మా వాడు ఫ్రెండ్స్ తో కలిసి నైటంతా తప్ప తాగి ఎంజాయ్ చేసి తెల్లవారుతుండగా ఆటోను గుద్దితే అందులో ఒక అమాయకుడు చచ్చాడు. అయినా మేమేమీ భయపడలేదే? డ్రైవర్ ను మార్చబోయి దొరికిపోయాం. పిల్లలు తాగరా? తాగితే తూలరా? తూలితే బండి నడిపి చంపరా? చట్టం తన పని తాను చేసుకుంటూ మా పని కూడా చేసి పెట్టదా?

# మూతిమీద మీసం కూడా మొలవని, నోట్లో వేలు పెడితే కొరకడం కూడా తెలియని, ఎండ కన్నెరుగని మా పాల బుగ్గల అమూల్ పిల్లలను అలా నడి రోడ్డు మీద లైఫ్ ట్యాక్స్ కట్టలేదని ఆపితే మా గుండెలు తరుక్కు పోతున్నాయి. చూడలేక పోతున్నాం.

# మేము బంజారా కొండల్లో, జూబ్లీ గుట్టల్లో, మాధాపూర్ చెరువుల్లో, కోకాపేట బండల్లో రాత్రిళ్లు రిక్షాలు తొక్కి తొక్కి…పైసా పైసా పోగు చేసి కొన్న కార్లవి. మా చెమట, నెత్తురు చిందించి పిల్లల ముచ్చట తీర్చడానికి కొన్న కార్లకు ఈ లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టలేము. ఒకవేళ లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే మేము పగలు కూడా పంజాగుట్ట సర్కిల్లో రిక్షాలు తొక్కాలి. పగలు సాధారణంగా మేము దిగజారలేము.

# కాబట్టి ఈ సంపన్న దయనీయ లేదా దయనీయ సంపన్న విపత్కర, విచిత్ర, వైరుధ్య ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని…మా బంగారు కొండలు వాడుతున్న ఆట బొమ్మలయిన, ఇనుప ముక్కల పెట్టెలయిన ఆరు కోట్ల కార్లకు లైఫ్ ట్యాక్స్ లైఫ్ లాంగ్ అడగకూడదని ఆదేశిస్తున్నాం.

# తెలిసో, తెలియకో ఇప్పటికే కట్టించుకున్న పెనాల్టీలను వడ్డీలతో సహా వెనక్కు ఇచ్చి, దెబ్బ తిన్న మా పిల్లల మనోభావాలు అతుక్కోవడానికి వారికి బే షరతు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నాం.

Tax fraud By Luxury Car Owners

# సైకిళ్లకు రోడ్ల మీద ప్రత్యేక ట్రాక్ లు వేస్తున్నట్లు మా ఆరు కోట్ల కార్లకే ప్రత్యేక ట్రాక్ లు వేయడానికి వీలుగా రోడ్లను రీ డిజైన్ చేయాలని ప్రతిపాదిస్తున్నాం.

ఇట్లు,
లైఫ్ ట్యాక్స్ కట్టకుండా విదేశీ కార్లను తిప్పే బలిసిన స్వదేశీ పిల్లల తల్లిదండ్రుల సంఘం

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఆడీకి ఆటో లేఖ

Also Read: పెద్దవారి హై స్పిరిట్! వారి పిల్లల ట్రూ స్పిరిట్!!

RELATED ARTICLES

Most Popular

న్యూస్