No Welfare: ప్రభుత్వ సంక్షేమ అమలు తీరు చెప్పేది కొండంత చేసేది గోరంత అనే రీతిలో ఉందని ఎమ్మెల్సీ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను విస్మరించారని, బీసీలకు కూడా మోడీ చేయి చూపారని విమర్శించారు. హాజరు నిబంధన పేరుతో అమ్మ ఒడిలో కోతలు పెట్టారని, కరెంటు బిల్లుల పేరుతో మిగిలిన సంక్షేమ పథకాల్లో కూడా భారీగా కోతలు విధించారని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచేదీ ప్రభుత్వమే, బిల్లు ఎక్కువ వచ్చిందన్న సాకుతో సంక్షేమం కట్ చేస్తోంది కూడా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, అవి మీటర్లు కాదని రైతుల పాలిట ఉరితాళ్ళు అన్నారు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిబంధనలు పెట్టి కొంతమందికే ఇస్తు న్నారని విమర్శించారు.
ప్రభుత్వం బడ్జెట్ లో కోర్టు దిక్కరణకు పాల్పడిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పుచెప్పినా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనని స్పష్టం చేశారు. అసలు బడ్జెట్ లో అమరావతి ప్రస్తావనే లేకపోవడం దుర్మార్గామన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలోనే ఎండగడతామని అచ్చెన్న హెచ్చరించారు.