Sunday, January 19, 2025
HomeTrending Newsవిశాఖ భూదందాలపై సిఎం నోరు విప్పాలి: బొండా

విశాఖ భూదందాలపై సిఎం నోరు విప్పాలి: బొండా

విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. భూ యజమానుల మెడమీద కత్తిపెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. భూ యజమానులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఒకవేళ భూమి ఇవ్వకపోతే 22/ఎ కింద మారుస్తామని హెచ్చరిస్తున్నారని, విశాఖలో ఇంతవరకూ జరగని భూ దందాలు ఇప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీలో నంబర్ టూలో ఉన్న విజయసాయి రెడ్డి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల భూములను తన కుమార్తె పేరుతో దోచుకున్నారని బొండా ఉమా అన్నారు. మొత్తం 40వేల కోట్ల రూపాయల ఆస్తులను వైసీపీ నేతలు దోచుకున్నారని, వీటికి సంబంధించిన ఆధారాలు డాక్యుమెంట్లతో సహా తమ వద్ద ఉన్నాయని ఉమా వెల్లడించారు.

భూ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా నిన్న ఓ ఘటన వెలుగులోకి వచ్చిందని… కూర్మన్న పాలెంలో దాదాపు ఐదువందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను 99శాతం డెవలపర్ కు, కేవలం ఒక్క శాతం భూ యజమానికి వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని, దీని వెనుక ఆ పార్టీ ఎంపీ ఎంవివి హస్తం ఉందని ఉమా ఆరోపించారు. రాజస్తాన్ ఎడారిలో కూడా ఇలాంటి ఒప్పందం జరిగి ఉండదని వ్యంగ్యంగా అన్నారు. ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికైనా సిఎం జగన్ నోరు విప్పాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో  విశాఖను ఫైనాన్సియల్ సిటీగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వం క్రైమ్ సిటీగా మార్చిందని విమర్శించారు. నగరంలో జరుగుతున్న వ్యవహారాలపై మేధావులు, సామాజిక వేత్తలు స్పందించాలని బొండా విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం ఈ వ్యవహారాలపై స్పందించి విచారణ జరిపించకపొతే తామే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Also Read : వియ్యంకుడు కొనుగోలు చేస్తే నాకేం సంబంధం? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్