వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఏపీ భవిష్యత్తు కోసమే తాము కలుస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ పాలనకు ఇంకా ఆరునెలల సమయం మాత్రమే ఉందని హెచ్చరించారు. ఏపీలో అరాచక పాలనను అంతమొందించాలంటే రాష్ట్రంలో బిజెపి-టిడిపి-జనసేన సమిష్టిగా పోరాడాలని తాను బలంగా కోరుకుంటున్నారని, దీనిపై ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే బిజెపి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని ఓడించలేమన్నారు. రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలతో కలిసి చంద్రబాబును ములాఖత్ అయ్యారు.
సైబరాబాద్ ను నిర్మించిన ఓ అనుభవం ఉన్న రాజకీయనేతను ఒక కుంభకోణంలో ఇరికించి జైల్లో పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. బ్యాంకులో తప్పు జరిగితే దాన్ని ఆ బ్రాంచ్ మేనేజర్ ను తప్పుబట్టలేమని అన్నారు. ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న, నేరాలు చేసిన వ్యక్తి అధికారంలో ఉండి ఇలా అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తోన్న వ్యక్తి.. తాను బురదలో కూరుకుపోయి అందరిమీదా బురద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కానీ ఆయనకు ఈ కేసుతో ఏం సంబంధం ఉందో నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అరాచక పాలనకు చంద్రబాబు అరెస్టు నిదర్శనమని, ఆయన్ను అక్రమంగా రిమాండ్ కు పంపారని వ్యాఖ్యానించారు. బాబుకు- తమకు మధ్య విధానపరమైన విభేదాలేనన్నారు. దేశానికి ఓ బలమైన నాయకత్వం కావాలన్న ఉద్దేశంతోనే గతంలో నరేంద్ర మోడీకి మద్దతు పలికానని, దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా మోడీకి మద్దతు తెలిపింది తానేనన్నారు. అదే రీతిలో విభజనతో నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు సమర్ధ నాయకత్వం కావాలన్న లక్ష్యంతోనే చంద్రబాబుకు కూడా 2014 ఎన్నికల్లో మద్దతు తెలిపానని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోకుండా ఉండాల్సింది అనే భావనతోనే ఆ తర్వాతి కాలంలో బాబును విభేదించానని చెప్పారు. తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి హస్తం లేదని పవన్ అభిప్రాయపడ్డారు.