Tuesday, January 28, 2025
HomeTrending Newsరాష్ట్రాన్ని గాడిలో పెడతాం: బాబు భరోసా

రాష్ట్రాన్ని గాడిలో పెడతాం: బాబు భరోసా

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపం అవుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని, తమ పొత్తు చారిత్రాత్మక అవసరమని అభివర్ణించారు. ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు వారిని నడిపించే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ముగింపు సందర్భంగా  విశాఖపట్నం జిల్లా తగరపు వలస మండలం పోలిపల్లి వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

లోకేష్ తన పాదయాత్ర ద్వారా జగన్ పాలనపై దండయాత్ర చేశారని ప్రశంసించారు. జగన్ లాంటి విచిత్రమైన నాయకుడిన తన జీవితంలో చూడలేదన్నారు. తమ పొత్తు ప్రకటించిన రోజే హిట్ గా నిలిచిందని, జగన్ సినిమా అయిపోయిందని, అది మునిగిపోయే పడవ అని, అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్-తాను తీసుకోబోయే నిర్ణయాలని ఇరు పార్టీల కార్యకర్తలూ పూర్తిగా ఆచరిస్తూ ముందుకెళ్ళాలని, వందరోజులు కలిసి పనిచేస్తే ఆ తర్వాత వారిని ఎలా గుర్తించాలో, ఆదుకోవాలో తాము ఆలోచిస్తామని స్పష్టం చేశారు. తన నలబై ఏళ్ళ అనుభవంతో రాబోయే ఐదేళ్ళలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఇప్పటం సభలోనే ప్రకటించానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ దాదాపు 80 మంది అభ్యర్ధులను మారుస్తున్నట్లు చూస్తున్నానని, కానీ మార్చాల్సింది వారిని కాదని జగన్ నే మార్చాలని పిలుపు ఇచ్చారు. విభజన తరువాత  ఆంధ్ర ప్రదేశ్ కు కనీసం పదేళ్ళపాటు సమర్ధ నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచించే బాబుకు గతంలో మద్దతు ఇచ్చానని, కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల తమ పొత్తు కొనసాగలేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలూ ఓ స్పస్తమైన విధానంలో కలిసి పోటీ చేసి జగన్ ను ఇంటికి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పదేళ్ళపాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేస్తామని స్పష్తం చేశారు. టిడిపి-జనసేన ఉమ్మడిగా మేనిఫెస్టో ఇస్తామని, కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ మైత్రీ బంధానికి బిజెపి ఆశీస్సులు కూడా ఉంటాయన్న విస్వాశాన్ని పవన్ వెలిబుచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్