జగన్ పాలనలో క్రైమ్ అండ్ కరప్షన్ పెరిగిపోయాయని, అన్ని రంగాల్లో రాష్ట్ర సర్వనాశనం అయ్యిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడు బీహార్, ఉత్తర ప్రదేశ్ మెరుగు అనే పరిస్థితి వచ్చిందన్నారు. అక్కడ పరిపాలన మెరుగుపడితే ఇక్కడ దురదృష్టకర పాలన సాగుతోందన్నారు. జగన్ పాలనలో తమపై ఎన్ని తప్పుడు క్రిమినల్ కేసులు బుక్ చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి నచ్చని పని ఏది చేసినా కేసులు పెట్టి విమర్శలు చేయించడం దారుణమన్నారు. తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తే ఐదారు సీక్వెల్స్ తీయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మైనింగ్ చట్టం జగన్ పాదాల కింద నలిగిపోతోందని విమర్శించారు. తలైవా రజనీకాంత్ వచ్చి ఎన్టీఆర్ ను, చంద్రబాబును పొగిడి వెళ్ళారని, మంత్రుల చేత రజనీకాంత్ ను కూడా తిట్టించే కార్యక్రమం చేయడం దారుణమన్నారు. జగనాసుర చరిత్రపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశలో మాట్లాడారు.
జగన్ ఓ బాబాయి హత్యకు గురయ్యారని, మరో బాబాయి జైలుకు వెళ్ళారని, రేపో మాపో తమ్ముడు జైలుకు వెళుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని, అంతటి ఘోరమైన పరిస్థితులు ఉంటే కేంద్రం ఏం చేస్తుందో అర్ధం కావడంలేదన్నారు. జగన్ పాపాలు పండాయని, పరాకాష్టకు చేరుకున్నాయని, ఇప్పటికే 108 నియోజకవర్గాల్లో ప్రజలు మొన్నటి మండలి ఎన్నికల ద్వారా తీర్పు చెప్పారని, ఎన్టీఆర్ శత జయంతి సమయానికే జగన్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయ స్వామి; పార్టీ నేతలు కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, వంగలపూడి అనిత మీడియా సమావేశంలో పాల్గొన్నారు.