తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వయసు మీరిందని, లోకేష్ కు రాజకీయాలు తెలియవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై పెద్దిరెడ్డి స్పందించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంపట్ల అయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు 2018లోనే జరగాల్సి ఉండగా పార్టీలో గ్రూపులు, ఓటమి భయంతో చంద్రబాబు నాడు నిర్వహించలేదని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు నిర్వహిస్తే నామినేషన్ వేసిన తరువాత ఓటమి భయంతో బహిష్కరిస్తున్నట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. ఓటమిని ముందే అర్ధం చేసుకుని ఎన్నికలకు భయపడి చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయం పొందారని, ఇప్పుడు ఏకపక్షంగా వైసీపీ కుప్పంలో గెలిచిందని అయన వివరించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబే స్వయంగా బరిలోకి దిగాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కుప్పంలో కొడుకునో, బంధువులనో దింపకుండా అయన పోటీ చేయాలని, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ ఫలితం ఏమిటో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. సిఎం జగన్ రెండేళ్ళలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 90శాతం హామీలను నెరవేర్చి ప్రజల విశ్వాసాన్ని మరింతగా సంపాదించారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సిఎం జగన్ నాయకత్వ పటిమకు, తమ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే కుప్పంలో కూడా వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు పెద్దిరెడ్డి.