తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ ఈనెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మహానాడు నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
ఎన్నికల కౌంటింగ్, ఫలితాల సరళి, మెజార్టీ సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉండాల్సి వస్తుందని, ఈ సమయంలో మహానాడు నిర్వహణపై దృష్టి సారించడం సాధ్యం కాదనే ఆలోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. అందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మహానాడు నిర్వహించలేకపోయినా గతంలో మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులు, పార్టీ జెండాల ఆవిష్కరణ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, మహానాడు ఎప్పుడు జరపాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.