Sunday, January 19, 2025
HomeTrending Newsఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి

ఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి

కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా ప్రజలకు సంక్షేమం అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దీంతో ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని, అందుకే ప్రతి ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు అపూర్వ విజయాలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ ప్రజల మనసుల్లో ఎక్కేలా ఎంతటి విష ప్రచారానికైనా తెగిస్తున్నారని ధ్వజమెత్తారు. సిఎం సలహాదారు దువ్వూరి కృష్ణ తో కలిసి సచివాలయంలో  మీడియా సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయనకు  పక్కవాయిద్యాలు వాయించే బృందం అంతా కలిసి ఏకోన్ముఖంగా ఒక పద్ధతి ప్రకారం దాడి చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

చివరకు పార్లమెంటులో ఒక ప్రశ్నవేసి, మూతి పగలగొట్టించుకున్నారని, 2014–19 మధ్య ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, కాగ్‌ అడిగితే రూ.51 వేల కోట్లకు మాత్రమే లెక్క చెప్పారని, స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారని, దీంతో వారు తమ గోతిలో తామే పడ్డారని ఎద్దేవా చేశారు.

ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక దేశాన్ని ఒక రాష్ట్రంలో పోల్చకూడదని ఎందుకంటే ఒక దేశానికి చాలా బాధ్యతలు ఉంటాయని సలహాదారు దువ్వూరి కృష్ణ అన్నారు. దేశానికి సంబంధించి ఎగుమతి, దిగుమతులు, విదేశీ మారకద్రవ్య నిధులు ఉంటాయని అవి సరిపోకపోతే ద్రవ్యలోటు పెరుగుతుందని, తద్వారా దేశం అప్పులు పెరుగుతాయని, కానీ ఇవేవీ ఒక రాష్ట్రంలో ఉండవని విశ్లేషించారు.

“2013–14లో కేంద్రం అప్పు జీడీపీలో (డెట్‌ టు జీడీపీ) 50 శాతం ఉండగా, అది 2020–21 నాటికి 61 శాతానికి చేరింది. ఆ తర్వాత కేంద్రం తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల అది కాస్త తగ్గి, 57.42 శాతానికి చేరింది. రాష్ట్రంలో కూడా కేంద్రం తరహాలో చర్యలు తీసుకోవడం వల్ల, ఇక్కడ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అత్యంత తక్కువగా 2.1 శాతం నమోదైంది. రాష్ట్ర ఖర్చుల కోసం చేసే అప్పు ద్రవ్యలోటు. అయితే దానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఒక పరిమితి ఉంటుంది. అలాగే కేంద్రం అనుమతించే పరిమితి కూడా ఉంటుంది.

2014 నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీలో 3 శాతం వరకు మాత్రమే అప్పులు చేసే అనుమతి ఉండగా, కానీ ఏ ఒక్క ఏడాది కూడా వారు ఆ పరిమితికి లోబడి అప్పులు చేయలేదు. దీంతో అప్పుడు ద్రవ్యలోటు చూస్తే 2014–15లో 3.95 శాతం, 2015–16లో 3.65 శాతం, 2016–17లో 4.52 శాతం, 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.06 శాతంగా ఉంది.  ఇక ఈ ప్రభుత్వం వచ్చాక 2020–21లో ద్రవ్యలోటు 5.44 శాతంగా ఉంది. అందుకు ప్రధాన కారణం. కోవిడ్‌ వల్ల రాష్ట్రం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. నిజం చెప్పాలంటే అన్ని రాష్ట్రాలతో పాటు, కేంద్రం కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021–22లో ప్రభుత్వం చేసిన అప్పు జీడీపీలో కేవలం 2.1 శాతం మాత్రమే. ఇది నిజంగా అభినందనీయం” అంటూ ఏపీ ఆర్ధిక వ్యవస్థపై వివరాలు అందించారు.

Also Read : సంక్షేమం కోసమా? స్వార్ధం కోసమా: కేశవ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్