దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేవరకూ బాబును అడ్డుకుంటామని, నిరసన తెలియజేస్తూ ఉంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ ఆందోళన ఇప్పటితో ఆగదని, మొన్న బద్వేల్ లో కూడా జరిగిందని, నిన్న తమ నియోజకవర్గంలో నిరసన తెలిపామని, బాబు ఏ ఎస్సీ నియోజకవర్గంలో పర్యటించినా నిరసన తెలియజేస్తూనే ఉంటామని వెల్లడించారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపొతే ఆ విషయాన్నైనా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెంలోని తన కార్యాలయంలో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు.
రాళ్ళు, కర్రలతో తమపై దాడి చేసి, బాబు కాన్వాయ్ పై దాడి జరిగిందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి దుయ్యబట్టారు. తాము శాంతియుగంగా నిరసన తెలియజేస్తుంటే, బాబు బైటకు వచ్చి వేలు చూపిస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించారని, దీనితో టిడిపి శ్రేణులు అహంకారంతో తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని చెప్పారు. సత్యాన్ని ఎవరూ దాచిపెట్టలేరని, నిజం నిప్పులాంటిదని అది ఏదో ఒక రోజున చంద్రబాబును దహించి వేస్తుందని వ్యఖ్యానిచారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని, మా రక్తం కళ్ళజూస్తే భయపడబోమని హెచ్చరించారు. దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, విభజించి చూడాలనుకుంటే కుదరదని, దళితులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోక పొతే మా జాతి సమాధానం చెబుతుందని తేల్చి చెప్పారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
గతంలో జరిగిన కారంచేడు, చుండూరు లాంటి మారణహోమం సృష్టించి దళితులను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బాబు కుట్రతో, ముందస్తు ప్రణాళికలో భాగంగానే, అల్లరి మూకలను వెంట వేసుకొని వచ్చారని, దారిలో నలభై నిమిషాలపాటు ఆగాల్సిన అవసరం ఏమిటని సురేష్ నిలదీశారు/