Sunday, January 19, 2025
HomeTrending Newsమాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

వైసీపీలో  మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ కు టిడిపి పార్లమెంటరీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.

మాధవ్ పై చర్య విషయంలో వైసీపీ రోజుకో మాట మారుస్తూ కాలయాపన చేస్తోందని, ఒక్క మాధవ్ పై చర్య తీసుకుంటే మిగిలిన అందరిపైనా తీసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారని రామ్మోహన్ ఎద్దేవా చేశారు. ఇంత పబ్లిక్ గా వీడియో బైటకు వస్తే చర్యలు తీసుకోకపోతే వీరు సమాజానికి ఏం చెప్పదలచుకున్నారని నిలదీశారు.  ఈ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, అవసరమైతే  ప్రివిలేజ్ కమిటీ కి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ కు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు.  ఇది ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వ్యవహారం కాదని, మొత్తం పార్లమెంట్ ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా పనికిమాలిన విషయాల మీదే వైసీపీ ఎంపీలు దృష్టి పెడుతున్నారని, ప్రత్యేక హోదాపై నోరు మెదపరు కానీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రం అంతా కట్టకట్టుకొని లాబీయింగ్ చేసి  ఈ దుర్మార్గాలను మరుగున పడేసేలా చేస్తున్నారన్నారు.

వైసీపీ ఎంపీ వ్యవహారం సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, పోలీసులే దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.  చట్టం తన పని తాను చేయకుండా విచారణ, నివేదికల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. మాధవ్ వీడియో కు, చంద్రబాబు కేసుకు ముడి పెట్టడం ఏమిటన్నారు.  ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తోందన్నారు. మాధవ్ వ్యవహారాన్ని సమర్ధించుకోవాలని చూడడం వైసీపీ విశృంఖలత్వానికి, అరాచకత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.

Also Read : తప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్