ముందస్తు ఎన్నికల కోసమే సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఐ-ప్యాక్ కూడా గత వారం ఇచ్చిన సర్వేలో వైసీపీకి ఓటమి తప్పదని నివేదిక ఇచ్చిందని అందుకే ముందస్తు కోసం ఢిల్లీ పరుగెత్తుకు వెళ్లి మోడీని అడిగారని చెప్పారు. రాష్ట్రం గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ గౌరవంగా బతకాలంటే టిడిపి అధికారంలోకి రావాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమత్రి కావడం చారిత్రక అవసరమని, అలా కాకపొతే అందరం ఇళ్ళకు తాళాలేసి ఇతర ప్రాంతాలకు పారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గం లో భవిష్యత్ కు గ్యారంటీ చైతన్య రథయాత్ర బహిరంగ సభకు అచ్చెన్న హాజరై ప్రసంగించారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి 160సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014-19 ఈ రాష్ట్రానికి స్వర్ణయుగం అని పేర్కొన్నారు. కానీ ప్రజలు తప్పు చేశారని, ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు 151 సీట్లు ఇచ్చి గెలిపించారని… కానీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. ఎప్పుడూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ సిఎం మాట్లాడుతుంటారని … కానీ దేశంలో ఎస్సీలపై అత్యధికంగా దాడులు జరుగుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
వర్షాకాలం వచ్చిందని చేపలు పట్టడానికి నదికో, సముద్రానిలో వెళ్ళాల్సిన అవసరం లేదని రోడ్ల మీదే చేపలు పట్టొచ్చని అచ్చెన్న ఎద్దేవా చేశారు. ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులు గమనించే చంద్రబాబు తొలిదశలో ఆరు హామీలతో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో ప్రకటించారని, ఈ సూపర్ సిక్స్ ను పార్టీ శ్రేణులు ఇంటింటికీ తీసుకెళ్ళాలని కోరారు.