TDP Protest: జంగారెడ్డి గూడెంలో మరణాలపై వెంటనే చర్చ చేపట్టాలని అసెంబ్లీ లో తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఈ విషయమై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి చర్చ ప్రారంభించాలని కోరింది. ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మంత్రి దీనిపై వివరాలు అందిస్తారని ప్రభుత్వం తరఫున చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ చెప్పినప్పటికీ టిడిపి సభ్యులు ఆందోళన వీడలేదు. కల్తీ, నాటు సారా తాగి వీరంతా చనిపోయారని, మద్య నిషేధం చేయలేని మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్ళారు.
ప్రతిపక్ష టిడిపి సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చ చేద్దామని చెప్పినా టిడిపి వినిపించుకోకపోవడం సరికాదన్నారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. వారి ప్రశ్నలే ఇప్పుడు ఉన్నాయని, అయినా సరే వారు గొడవ చేసేందుకే సిద్ధమై వచ్చారని ఆరోపించారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి సభ్యులను వారించారు. వెంటనే తమ స్థానాల్లో కూర్చోవాలని, ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు తయారుగా ఉందని చెప్పారు. ఒకానొక దశలో స్పీకర్ స్థానం వైపు దూసుకు వెళ్లేందుకు టిడిపి సభ్యులు యత్నించడంతో స్పీకర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం తలెత్తడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.