రాష్ట్ర ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఆందోళనా కార్యక్రమం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ తాజాగా మరో నిరసనకు రూపకల్పన చేసింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రచ్చబండ తరహా కార్యక్రమం నిర్వహించనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనిలో ‘ఇదేం ఖర్మ’ తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ‘92612 92612’ ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని, పాలనను చూడలేదన్నారు. ఇటీవలి తన నందిగామ పర్యటనలో కాన్వాయ్ పై రాళ్ళు వేస్తే అది మా సిఎస్ఓ కు తగిలిందని… పూలలో రాయి వచ్చిందని వారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇవాళ రాయి వచ్చింది, రేపు బాంబు వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. మూడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిందని, ఎంతో విధ్వంసం జరిగిందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నామని, అందుకే దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపు టిడిపికి ఉందని చెప్పారు.
కర్నూలు జిల్లా పర్యటనలో… తన జీవితంలో ఎన్నడూ లేనంతమంది ప్రజలు టిడిపి సభల్లో పాల్గొన్నారని, ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరయ్యారని, దీన్ని బట్టి వారు ఈ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్ధమయ్యిందని బాబు వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, నాయకులుగా మనం ముందుంది వారిని నడిపించి…ఈ అరాచకాలపై పోరాడాలని బాబు పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మరోసారి ఓడిపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడేవారు ఉండబోరని అదే విషయాన్ని తాను చెప్పానని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని, తెలుగుజాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: సంక్షేమంపై తెలుగుదేశం నిరసన