రాజ్యసభలో తెలుగుదేశం రీఎంట్రీ ఇవ్వనుంది. ఆవిర్భావం తరువాత 40 ఏళ్ళపాటు పెద్దలసభలో కొనసాగిన ఆ పార్టీ ఈ ఏప్రిల్ లో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం తరువాత రాజ్యసభలో పార్టీకి చోటు లేని లోటును తీర్చాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు యోచిస్తూ వస్తున్నారు. ఈ ఎత్తుగడ అతి త్వరలోనే ఫలించనుంది. వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకటర రమణ త్వరలో పార్టీకి, రాజ్యసభకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీనితో ఏర్పడే ఖాళీలో టిడిపి తన అభ్యర్ధిని పెద్దల సభకు పంపనుంది.
1983లో టిడిపి ఆవిర్భావం తరువాత 84లో జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎన్నికయ్యారు. అప్పటినుంచీ 2024 ఏప్రిల్ వరకూ ఆ పార్టీ ప్రాతినిధ్యం సభలో కొనసాగుతూనే వచ్చింది. కానీ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో… మూడు వరుస రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీనితో 40 ఏళ్ళ తరువాత తొలిసారి ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోవాల్సి వచ్చింది.
ఇటీవలి ఎన్నికల్లో కూటమి 21 లోక్ సభ; 164 అసెంబ్లీ సీట్లు గెల్చుకొని విజయధంకా మోగించింది. కానీ పెద్దల సభలో ఒక్క సభ్యుడూ లేకపోవడం తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. తరువాతి ఎన్నికలు 2026లో జరుగుతాయి. వైసీపీ నుంచి కనీసం 8 మంది టిడిపిలోకి ఫిరాయిస్తేనే చట్టం ప్రకారం వారికి టిడిపి సభ్యులుగా గుర్తింపు వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు అంతమంది పార్టీ మారే అవకాశం లేదు.
తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపో మాపో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. మూడు నెలల్లో దీనికి ఉప ఎన్నిక రానుంది. అప్పుడు టిడిపి తరఫున అభ్యర్ధిని దించడం ద్వారా మళ్ళీ ప్రాతినిధ్యం కలగనుంది.
వైసీపీలోని కీలక బిసి నేతలపై టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. మరో బిసి నేత, రాజ్యసభ ఎంపి బీద మస్తాన్ రావు కూడా త్వరలో టిడిపిలో చేరే అవకాశం ఉంది.