Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ICMR suggested  take classes under trees

“చెట్టునై పుట్టి ఉంటే-
ఏడాదికొక్క వసంతమయినా దక్కేది;
మనిషినై పుట్టి-
అన్ని వసంతాలూ కోల్పోయాను”
-గుంటూరు శేషేంద్ర శర్మ

దేశవ్యాప్తంగా పాఠశాలలు ఇక తెరుచుకోవచ్చంటూ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ప్రస్తుతానికి ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన పాయింట్.వరుసగా రెండు విద్యా సంవత్సరాలను కరోనా మింగేసింది. ఇప్పుడు ఏ తరగతిలో ఉన్నారో పిల్లలకు తెలియడం లేదు. ఎప్పటినుండో ఇంట్లోనే ఉంటూ ఆరు పూటలా బంగారు కొండల్లా ఆరారా తింటూ ఆన్ లైన్ క్లాసులను మ్యూట్ చేసి, టీ వీ లు చూడడం తప్ప వారికేమీ గుర్తు లేదు. పిల్లలు బొద్దుగా, ముద్దుగా, మొద్దుగా…ఎలా ఉన్నా ఇంటిపట్టున ఉన్నారన్న ఆనందం తప్ప వారి తలిదండ్రులకు కూడా ఇంకేమీ గుర్తు లేదు.

కనీసం ఇంకో రెండేళ్లయినా కరోనా ఉండేలానే ఉంది. ఆ తరువాత కూడా ఉంటుంది. తీవ్రత బాగా తగ్గవచ్చు- అంతే. చెట్ల కింద తరగతులను ఐ సి ఎం ఆర్ సిఫారసు చేయడానికి కారణాలు అందరికీ తెలిసినవే. ఏ సీ గదులు, నాలుగ్గోడల మధ్య వైరస్ వ్యాప్తికి అవకాశాలెక్కువ.

పిల్లల్లో ఒకరికి వస్తే వంద మందికి అంటుకుంటుంది. అదే చెట్ల కింద అయితే ఈ ప్రమాదం తక్కువ. స్వచ్ఛమయిన గాలి ఆరోగ్యకరం. కొంత ఎండ పొడ తగిలితే అత్యంత అవసరమయిన డి విటమిన్ కూడా దొరుకుతుంది. పక్కన పచ్చదనం కూడా ఉంటే కనువిందు. మనసుకు హాయి. కింద నేల మీద కాళ్లు ముడుచుకుని పద్మాసనం వేసుకుని కూర్చుంటే గొప్ప ప్రాణాయామం. ఇలా చెట్ల కింద చదువులతో ఉపయోగాలే ఉపయోగాలు.భూమి గుండ్రం. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ తిరక్కుండా స్థిరంగా నిలబడ్డ భూమ్మీద మనమే తిరుగుతున్నట్లు అనుకుంటూ ఉంటాం. ఎన్నో మాయల్లో బతికే మనకు భూమి మాయ అసలు అర్థం కాదు. అంతం లేని ఈ భూమి మనకు ఒక కాలి బాట లాంటిది అంటాడు పానశాలలో దువ్వూరి రామి రెడ్డి. ఆ బాటకు పొద్దున- సాయంత్రం రెండు ద్వారాలట. చక్రవర్తి అయినా అతడి బంటయినా పొద్దున ద్వారంలోనుండి నడిచి సాయంత్రం ద్వారం గుండా వెళ్లిపోవాల్సినవాళ్లమే కానీ…శాశ్వతంగా ఉండే హక్కే లేదు పొమ్మన్నాడు.

చెట్ల కిందా, కొమ్మల్లో, రాతి గుహల్లో మొదలయిన మానవ ప్రయాణం మళ్లీ అక్కడికే వెళుతోంది. వెళ్లక తప్పదు కూడా. ఇదివరకు ఊరంతా తిరిగి కాళ్లు-చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు. ఇప్పుడు కరోనా దెబ్బకు అందులో అందరికీ ఆరోగ్య రహస్యం బయటపడింది. చెట్ల కింద చదువుల్లో ఆరోగ్య రహస్యం కూడా అలాంటిదే. ఐ సి ఎం ఆర్ సూచనను పాటించడానికి దేశంలో ఎన్ని స్కూళ్లలో చెట్లు మిగిలి ఉన్నాయో మరి!

నగరాల్లో మహా వృక్షాలంటే బాటిల్లో పెరిగే మనీ ప్లాంట్ తీగలే. బాల్కనీ కుండీలో తనను తాను కుచింపజేసుకున్న బోన్సాయ్ లే.

కనీసం గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు మిగిలి ఉన్న స్కూళ్లు ఈ సూచనను పాటిస్తే మంచిది. కదిలే కొమ్మలు, రాలే ఆకులు, వాలే పక్షులు, పూచే పువ్వులు, ఎగిరే తుమ్మెదల మధ్య కూర్చుంటే పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుంది. ప్రాణానికి ప్రకృతి కొత్త ప్రాణ శక్తిని నూరి పోస్తుంది. పచ్చని ఆకులను తాకుతూ కొమ్మలను చీల్చుకుంటూ వెలుగు కిరణాలు మన ఒంటిపై పడాలంటే రాసి పెట్టి ఉండాలి. కొమ్మ కొమ్మకో సన్నాయి పాట వినడానికి చెవులకు అదృష్టం ఉండాలి. ఎండుటాకుల గలగలలు, పచ్చి ఆకుల గుసగుసలు వినడానికి మనసుకు చెవులుండాలి. చెవులకు రుచి ఉండాలి.ఆన్ లైన్ క్లాసులకు సిగ్నల్ దొరక్క చెట్టెక్కిన చదువులకయినా కొమ్మే ఆధారం. కరోనా వ్యాపించకుండా చదువులు సాగడానికయినా ఆ చెట్టు కొమ్మే ఆధారం. పిల్లల చదువులు చట్టుబండలయిన వేళ…మళ్లీ బడిగంట మోగడానికయినా ఆ చెట్టు బండలే ఆధారం.
మనిషి బతుకుకు చెట్టే ఆధారం.

నిజమే-
మనుషులమై పుట్టి అన్ని వసంతాలను కోల్పోయినా…
చెట్టును నాటినా
చెట్టుకు మొక్కినా
చెట్టు ఎక్కినా
చెట్టు కింద కూర్చున్నా
చెట్టు కింద నిలుచున్నా
చెట్టు కింద పడుకున్నా…
ప్రతిక్షణం వసంతమే.
చెట్టంత సంతోషమే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

కొళాయిల్లో శుద్ధ జలం

Also Read:

బియ్యానికి బి 12 తోడు

Also Read:

నో బుక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com