Saturday, November 23, 2024
HomeTrending Newsఅసెంబ్లీ సోమవారానికి వాయిదా

అసెంబ్లీ సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం (ఈ రోజు ) ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యం. 1981 -2002
వరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని, సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు.
1993లో అప్పటి ఏపీలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె నియోజకవర్గ ఎనలేని కృషిచేశారని, 2022 మార్చి 19న 90 సంవత్సరాల వయసులో మరణించారు’ అన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నది. జనార్దన్‌రెడ్డి 1972-78, 1978-1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 1959-71 వరకు హుజూరాబాద్‌ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు.

లెప్రా సొసైటీలో సభ్యుడైన ఆయన.. 1968 హిందూ కుష్ఠు నివారణ సమితిని స్థాపించి.. వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రజలకు సేవలందించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. సోషలిస్ట్‌ నేతగా గొప్ప పేరు సంపాదించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 2022, మార్చి 28న 87 సంవత్సరాల వయసులో మరణించారు. వారిద్దని మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. సభకు సీఎం కేసీఆర్‌, మంత్రులతో పాటు సభ్యులు హాజరయ్యారు.

Also Read : మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు – ఈటెల విమర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్