తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బన్సల్‌కు తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. దీంతో పాటు సునీల్ బన్సాల్ ను తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జి బాధ్యతలతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా శాఖల ఇంచార్జీగానూ నియమించారు. ఈ మూడు విపక్ష పాలిత రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా తరుణు చుగ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ లోని జయపూర్ సమీపంలోని కొట్ పుట్లీ బన్సాల్ స్వస్థలం, బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో స్వయం సేవక్ అయిన సునీల్ బన్సాల్ విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు(ఏబీవీపీ)లో పనిచేశారు. 1989లో రాజస్థాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచారు. విశ్వవిద్యాలయ విద్య పూర్తికాగానే ఆర్ ఎస్ ఎస్ లో ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పలు రాష్ట్రాల్లో ఏబీవీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ప్రారంభించిన యూత్ ఎగెనెస్ట్ కరెప్షన్(YAC) ఉద్యమానికి నేషనల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగేళ్లపాటు YAC కన్వీనర్ గా దేశ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా మోదీవైపు యువతను ఆకర్షించడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించింది. ఆ సమయంలోనే సునీల్ బన్సాల్ ను బీజేపీకి ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం కోరింది. దీంతో సునీల్ బన్సాల్ కు అమిత్ షా ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.
Also Read : సినీ నటి జయసుధతో బీజేపీ సంప్రదింపులు