ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రి వర్గ నిర్ణయాలను మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మంత్రివర్గ నిర్ణయాలు – ముఖ్యాంశాలు
అకాల వర్షాలు కురుస్తుండటంతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయం. రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగింత. సన్నవడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాలుకు 500 చొప్పున బోనస్.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా మంత్రివర్గం చర్చించింది. తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు నీరు ఇవ్వాలని నిర్ణయం.
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ బడులు తీర్చిదిద్దాలని.. గత దశాబ్ధకాలంలో విద్యావ్యవస్థను బీఆర్ఎస్ విస్మరించిందని.. తమ మార్క్ ఏంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యావ్యవస్థకు పెట్టపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బడుల్లో మౌళిక సదుపాయల విషయాల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. వేడుకలు ఘనంగా జరపాలని మంత్రివర్గంలో తీర్మానం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు.. సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయం. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
-దేశవేని భాస్కర్