మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమ నాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేస్తున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని యూనిట్ నిర్వహించింది.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న సినిమా విడుదలవుతుంది’’ అని అన్నారు.
దర్శకుడు హరీష్ వడత్యా మాట్లాడుతూ…తెలంగాణ దేవుడు వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు అని తెలిపారు.
నిర్మాత ఉస్మాన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. ఈ చిత్రం చేశాము. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.