తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సాదాసీదాగా ప్రచారం చేసిన ఎడ్మ బొజ్జి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రం ఘోర పరాభవం చవిచూశారు. ఆ కోవలో బిజెపి నేత ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, మధుయాష్కి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ఉన్నారు.
సంగారెడ్డి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓటమి పాలు కావటం అనుచరవర్గాన్ని నివ్వెరపరిచింది. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే జగ్గారెడ్డికి నియోజకవర్గంలో ప్రజానేతగా పేరుంది. రాజకీయంగా మాజీమంత్రి హరీష్ రావు పొడగిట్టని జగ్గారెడ్డి నిత్యం విమర్శలు సంధించేవారు. ఈ దఫా జగ్గారెడ్డి ఓటమే లక్ష్యంగా హరీష్ రావు పావులు కదిపారని…పోల్ మేనేజ్మెంట్ తో దెబ్బకొట్టారని నియోజకవర్గంలో టాక్.
చెన్నూరులో బాల్క సుమన్ ఓటమి స్వయంక్రుతాపరాధమే అని సమాచారం. రాష్ట్ర స్థాయిలో సీనియర్ నేతలను సైతం ఏకవచనంతో విమర్శించటం…అదే ధోరణి నియోజకవర్గంలో కొనసాగించారనే పేరుంది. కెసిఆర్, కేటిఆర్ లతో సాన్నిహిత్యం ఉండటంతో అధికారులు, నేతలను ఖాతరు చేసేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పేరు ప్రకటించగానే సుమన్ గ్రాఫ్ క్రమంగా పడిపోవటం మొదలైంది.
ఆర్మూర్ లో ఆశన్నగారి జీవన్ రెడ్డి ఓటమి తొలిరోజులలోనే ఖాయమైంది. నియోజకవర్గంలో విలువైన భూముల కబ్జా ఆరోపణలు..అవినీతిపై ప్రశ్నించే విపక్ష నేతలపై తప్పుడు కేసులతో బెదిరించేవారని విమర్శలు ఉన్నాయి. తనను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు నిర్వహించేవారిని టార్గెట్ చేసేవారని…ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసినా ప్రజలు నిరాదరణ చూపారు.
బిజెపి నేత ఈటెల రాజేందర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి హంగామా చేస్తే చివరకు ఓటమిని కౌగిలించుకున్నాడు. కెసిఆర్ తో వైరం తర్వాత రాజేందర్ సిఎం స్థాయి నేతగా ఉహించుకున్నారని కమలం నేతలే చెపుతున్నారు. రాష్ట్ర స్థాయి నేతగా పేరున్నా ఆ స్థాయిలో వ్యవహరించలేదని… ఈయన తీరును బిజెపిలో కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. గజ్వేల్ లో గెలిస్తే హుజురాబాద్ రాడని ప్రచారం జరిగింది. బిజెపి బిసి సిఎం నినాదం ఇవ్వగానే రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే క్రమంలో పార్టీలో సీనియర్ లను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో అగ్రనేతలతో ప్రచారం చేసినా ఓటర్లు కరుణ చూపలేదు.
సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తనకు పాలేరు స్థానం కావాలని పట్టుపట్టి చివరకు పొత్తులు చెడగొట్టారని ఎర్రదండు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిర్యాలగూడ సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసినా తమ్మినేని మంకుపట్టుతో..పార్టీ సొంతంగా బరిలోకి దిగేలే చేశారు. చివరకు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాకపోవటం గమనార్హం.
పాలమూరు జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు అహంకార పూరితంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. గువ్వల బాలరాజుపైనా అవే ఆరోపణలు. మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి సౌమ్యుడిగా కనిపించినా జడ్చర్ల పరిసరాల్లో విలువైన భూములు తన బినామీలకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ జిల్లాలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మినహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భుకబ్జాల ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పార్టీని పటిష్టం చేసిన ధర్మపురి అరవింద్ కోరుట్ల రావటం అనూహ్య పరిణామం. కోరుట్లలో ప్రజాభిమానం చూరగొన్నా పోల్ మేనేజ్మెంట్ లో విపలమయ్యారని సమాచారం. ఆర్మూర్ లో పోటీ చేస్తే బాగుండేదని అనుచరులు అంటున్నారు. ఇక నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంతో సంబంధం ఉన్న మధుయాష్కి ఎల్ బి నగర్ ఎంపిక చేసుకోవటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎల్ బి నగర్ లో నామినేషన్ వేశాక ప్రచారంలో మధుయాష్కి వెనుకపడ్డారు. నియోజకవర్గంలోని అనేక డివిజన్లలో ప్రజలను నేరుగా కలవలేకపోవటం… పార్టీ యంత్రాంగం బలంగా లేక పోల్ మేనేజ్మెంట్ లో దారుణంగా విఫలమయ్యారు.
పరాజయం చవిచూసిన నేతల్లో కొందరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడగా… అనుచరవర్గాన్ని, నియోజకవర్గ ప్రజలను విస్మరించిన వారు మరికొందరు ఉన్నారు. రాష్ట్ర స్థాయి నేతలుగా పేరు రావటంతో ఎక్కడ పోటీ చేసినా తమదే గెలుపు అనే ధీమాతో… ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలే వారిని ఓటమి వైపు నడిపించాయని విశ్లేషణలు జరుగుతున్నాయి.
-దేశవేని భాస్కర్