రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం అరణ్య భవన్ లో ఆలయ సేవల విస్తరణ, ఆన్ లైన్ సేవలు, కొత్తగా ధూప దీప నైవేద్య పథకం అమలు, దేవాదాయ శాఖ భూముల గజిట్ నోటిఫికేషన్, తదితర అంశాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆలయ సేవల విస్తరణ, భక్తులకు మెరుగైన సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. శ్రీవైష్ణవ, శివాలయాలు, అమ్మవార్ల దేవాలయాల్లో ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న పూజ సేవలను మిగితా దేవాలయాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కొన్ని దేవాలయాల్లో లేని పూజ సేవలను కొత్తగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 74 ఆలయాల్లో డిసెంబర్ 10 లోగా ఈ సేవలను భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఆయా ఆలయాల్లోని సేవలు, పూజల వివరాలను దేవాదాయ శాఖ వెబ్ సైట్ endowments.ts.nic.in/ లో భక్తులో కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేవాదాయ, ధర్మాదాయ భూములకు పటిష్ట రక్షణ. చట్టబద్ధ రక్షణ కోసం గెజిట్‌లో పొందుపరుస్తున్న దేవాదాయ శాఖ. గెజిట్ లోకి సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లా ఆలయ భూములు. త్వరలోనే గెజిట్ లోకి మిగతా జిల్లాల్లోని దేవాదాయ భూములు.
ఎంతో విలువైన దేవాలయాల భూములను కాపాడేందుకు దేవాదాయ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ భూములను దేవుడి పేరిటే శాశ్వతంగా ఉండే విధంగా చట్టబద్ధ రక్షణ కల్పించేందుకు మరో అడుగు ముందుకేసి ఆ వివరాలను గెజిట్ లో పొందుపరస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాల్లో గెజిట్ నమోదు ప్రక్రియ పూర్తైందని, మిగితా జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్ లో 1300 ఎకరాలు, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో 3 వేల ఎకరాలు దేవాదాయ భూములను గెజిట్ లో పబ్లిష్ చేసిటనట్లు చెప్పారు. గెజిట్‌లో భూముల వివరాలు నమోదు చేస్తే కబ్జా చేయడానికి, అన్యాక్రాంతం కావడానికి అవకాశమే ఉండదని, న్యాయస్థానాల్లో వివాదాలు త్వరతిగతిన పరిష్కారమయ్యే అస్కారం ఉందన్నారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ క్రిష్ణవేణి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎండోమెంట్ ల్యాండ్స్) రమదేవి, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.