Sunday, November 24, 2024
HomeTrending Newsఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

Telangana Police Ideal : రాష్ట్రం వస్తే నక్సలైట్‌ రాజ్యం అవుతుందన్న తెలంగాణ.. నేడు శాంతిభద్రతల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, సంఘవిద్రోహ శక్తుల కట్టడి, మహిళల రక్షణ.. ఇలా అన్నింటా తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా మారాయి. షీ-టీమ్స్‌ మొదలు ఆధునిక సాంకేతికత వినియోగం వరకు తెలంగాణ పోలీసుల మార్గాన్ని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. తాజాగా నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి శిక్షణ కోసం పలు రాష్ర్టాల నుంచి వచ్చిన 105 మంది కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారులకు తెలంగాణలో అమలవుతున్న ఫంక్షనల్‌ వర్టికల్‌ విధానంపై అవగాహన కల్పించారు. వీటిలో పలు అంశాలను ఆయా రాష్ర్టాల్లో అమలు చేసేందుకు వారంతా ఆసక్తి చూపారు.

సాంకేతికతతో ముందడుగు..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నారని ఈ ఏడేండ్లలో ఎన్నోసార్లు రుజువైంది. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) లోనూ తెలంగాణ పోలీసు ఎప్పుడూ ముందంజలోనే ఉంటున్నారు. పౌరులకు పోలీసు సేవలను ఆన్‌లైన్‌లో అందించడంలో, ఆపద సమయాల్లో హాక్‌ఐ మొబైల్‌ అప్లికేషన్‌ అరచేతిలో బ్రహ్మాస్త్రంలా మారింది. మొత్తం 31 లక్షల మంది యూజర్లతో పోలీస్‌ మొబైల్‌యాప్‌లలో దేశంలోనే రెండోస్థానంలో ఉందని గత నెలలో స్వయంగా కేంద్ర హోంశాఖ ప్రకటించడం గమనార్హం.

సాంకేతికత ఉపయోగించుకొని కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్‌, న్యాయవ్యవస్థలను కలిపి ఉంచే ఐసీజేఎస్‌(ఇంటర్‌ ఆపరేబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌) దేశంలోనే తొలిసారిగా పైలెట్‌ ప్రాజెక్టు కింద తెలంగాణలోనే ప్రారంభమైంది. వరంగల్‌, కరీంనగర్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 9 పోలీస్‌ స్టేషన్లలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీస్‌పై కేంద్ర హోంశాఖకు ఉన్న నమ్మకానికి ఇది మరో నిదర్శనం. అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) తరహాలో దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు పాపిలాన్‌ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకువచ్చారు. దీనివల్ల కరడుగట్టిన ఎంతోమంది నేరస్థులను కలుగులోంచి బయటకులాగి అరదండాలు వేయించారు. వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయగలిగారు.

దేశమంతా మన ‘షీ-టీమ్స్‌’
మహిళా భద్రత కోసం సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశనంతో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న షీ-టీమ్స్‌ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం తెలంగాణ షీ-టీమ్స్‌ గురించి తెలుసుకునేందుకు వరుస కడుతున్నారు. యువ ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చే నేషనల్‌ పోలీస్‌ అకాడమీలోనూ తెలంగాణ షీటీమ్స్‌, భరోసా కేంద్రాల పనితీరు, మహిళా భద్రతకు తీసుకుంటున్న అంశాలను ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ఇప్పటికే కేరళ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, యూపీ, కోల్‌కతా, నాగ్‌పూర్‌, ముంబై పోలీస్‌ అధికారుల బృందాలు హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళా భద్రత విభాగం కార్యాలయాన్ని, పోలీస్‌ షీటీమ్స్‌, భరోసా కేంద్రాలను సందర్శించి అక్కడి పనితీరును తెలుసుకున్నాయి.

తెలంగాణ మాదిరిగానే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ, ఒడిశాలోనూ షీ-టీమ్స్‌ వ్యవస్థను అదే పేరుతో అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో షీ-టీమ్స్‌ తరహాలోనే శక్తిటీమ్స్‌ పేరిట మహిళా రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. కోల్‌కతా, రాజస్థాన్‌లోనూ స్థానిక పేర్లతో షీటీమ్స్‌ అమల్లోకి వచ్చాయి. నాగ్‌పూర్‌లో షీటీమ్స్‌ మాడ్యూల్‌ను లేడీస్‌ స్పెషల్‌ పేరిట అమలు చేస్తున్నారు. కేరళ పోలీసులు, ముంబై పోలీసులు షీటీమ్స్‌ పనితీరును పరిశీలించి వెళ్లాయి.

కర్ణాటక పోలీసులు ఫోన్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. 2019లో లక్నోలో జరిగిన పోలీస్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సందర్భంగా ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ ఇన్‌చార్జి స్వాతిలక్రాను ప్రత్యేకంగా పిలిపించుకున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు షీటీమ్స్‌ గురించి తెలుసుకున్నారు. తెలంగాణలో పోలీస్‌ వ్యవస్థ గురించి కేరళ సీఎం పినరయి విజయన్‌ నగరానికి వచ్చి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను, పంజాగుట్ట స్టేషన్‌ను ఆయన స్వయంగా పరిశీలించి వెళ్లారు.

నిఘానేత్రాల్లోనూ మనమే టాప్‌
నేర పరిశోధన, నేరాల నియంత్రణలో అత్యంత కీలకమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటులోనూ తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 50శాతం తెలంగాణలోనే ఉన్నట్టు ఇటీవల బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌అండ్‌డీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. పోలీసుశాఖకు తోడు నేనుసైతం వంటి కార్యక్రమాలతో, సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షలకు పైచిలుకు ఉన్నట్టు అధికారిక సమాచారం.

శాంతిభద్రతల నిర్వహణలోనూ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్టంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. డీజీపీ మొదలు యావత్‌ తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం శాంతిభద్రతల అదుపులో ఉంచేందుకు ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్లు పెట్టే అంశంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు సాఫీగా ఏర్పాటు కావడం, వివాదరహితంగా స్థానికతకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయంతో ముందుకు వెళ్లింది.అదే సమయంలో పోలీస్‌శాఖ సైతం పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆ ప్రక్రియ శాంతియుతంగా ముగిసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ వేదికలపైనా మన పోలీసుల ప్రతిభ
జాతీయస్థాయిలోనే కాదు.. తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ వేదికలపైనా తమ సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీసు విధానాలకు ఇతర దేశాల్లోనూ ప్రశంసలు దక్కుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్యసమితి సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ విభాగం డిప్యూటీ అడ్వైజర్‌ విక్టర్‌ కోబిన్‌ నేతృత్వంలోని బృందం మన షీటీమ్స్‌ పనితీరును ప్రశంసించింది. పోలీసింగ్‌లో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆ బృందం ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నది.

ఎలక్ట్రిక్‌ పరికరాల ఏర్పాటు కాంట్రాక్ట్‌ పేరిట రష్యన్‌ ఎంబసీని మోసగించి వారి కేసును టెక్నాలజీని ఉపయోగించి వేగంగా ఛేదించడాన్ని అభినందిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డికి రష్యన్‌ రాయబారి ప్రత్యేంగా ప్రశంసాలేఖ రాశారు. కమాండ్‌ కంట్రోల్‌సెంటర్లు, బాడీవార్న్‌ కెమెరాలు, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు సహా తెలంగాణ పోలీసులు వాడుతున్న సాంకేతికతను 2018లో నగరానికి వచ్చిన శ్రీలంక ఉన్నతస్థాయి బృందం ప్రశంసించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్