Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

Telugu Academy Funds Fraud :

Telugu Language fans stunned after knowing on Academy Funds scam…..లోకం పట్టించుకోవడం మానేసిన ఒకానొక తెలుగు అకాడెమీలో ఇప్పటికి అరవై కోట్ల కుంభకోణం జరిగిందా?
ఇంగువ కట్టిన గుడ్డగా కూడా మిగలని ఒకానొక అకాడెమీలో 350 కోట్ల నిధులు మూలుగుతున్నాయా?

హైదరాబాద్ హిమాయత్ నగర్ కు కొన్ని దశాబ్దాలపాటు కొండగుర్తుగా ఉండి…ఇప్పుడు కొడిగట్టిన దీపంలా దీనంగా నిలిచిన తెలుగు అకాడెమీ అకౌంట్లో వందల కోట్ల డబ్బులున్నాయా?

తెలుగు మాధ్యమంలో విద్యాబోధనకు పుస్తకాలను ప్రచురించి లక్షల మంది విద్యార్థులకు చవక ధరలకు పుస్తకాలు అమ్మిన తెలుగు అకాడెమీలో ఇన్ని ధనరాశులున్నాయా?

విద్యా సంబంధమయిన పుస్తకాలే కాకుండా తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి…సకల రంగాలకు సంబంధించిన ఎన్నెన్నో గ్రంథాలను ప్రచురించిన ఒకానొక అకాడెమీలో వందల కోట్ల సొమ్ముకు లెక్క లేదా?

ఈ ప్రశ్నలకు హైదరాబాద్ పోలీసు సెంట్రల్ క్రైమ్ స్టేషన్- సి సి ఎస్ వారు ఎలాగూ సమాధానాలు చెబుతారు. సి సి ఎస్ ను తెలుగులోకి అనువదిస్తే కేంద్ర నేర స్థానం- కేం. నే. స్థా. అయి అపార్థం ధ్వనిస్తుంది. కేంద్ర నేర పరిశోధన/విచారణ విభాగం అని అనాలేమో?

పాపం! వారు నేరం ఎలా జరిగిందో కనుక్కునేవారే కానీ…నేరానికి వారే కేంద్ర స్థానమిచ్చిన వారు కాదు!

సి సి ఎస్ ను తెలుగులో ఏమనాలి? అంటే టక్కున చెప్పలేం. అలాగే అర్థం కాని అయోమయంలా ఉంది అకాడెమీ కుంభకోణం కూడా. తెలుగు వాడకం మీద మన నిర్లక్యం గురించి చెప్పలేక మాటలు మూగబోతాయి. తెలుగు అకాడెమీలో నిధుల వెలుగును ఎవరో దొంగిలించిన నేరాన్ని సి సి ఎస్ ఎలా వెలికి తీస్తుందో చూడాలి. తెలుగు అకాడెమీ అనేదొకటి ఉందని మన స్మృతి పథం నుండి ఎప్పుడో జారిపోయింది. ఆ విస్మృతే చెయ్యి వాటం కలిగినవారికి కలిసొచ్చి ఈ కుంభకోణానికి కారణమయినట్లు ఉంది. అకాడెమీలో ఏమి జరుగుతోంది? పుస్తకాల అమ్మకాల్లో ఎంత డబ్బు వస్తోంది? రాయితీల కోసం ప్రభుత్వం ఎంత సహాయం చేస్తోంది?

రెండు రాష్ట్రాల విభజన తరువాత అకాడెమీ ఆస్తులు, బ్యాంకుల్లో నగదు నిల్వల పంపకాల గురించి పట్టించుకున్నవారు లేరు. దాంతో అకాడెమీ ఉద్యోగులు బ్యాంకులవారితో కుమ్మక్కయి నిధులతో ఒక ఆట ఆడుకున్నారు.  34 బ్యాంకుల్లో కోట్లకు కోట్లు అకాడెమీ ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నట్లు ఒక అంచనా. అకౌంట్ లేకుండానే కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడాన్ని బట్టి చూస్తే…భవిష్యత్తులో వాటిని దారి మళ్లించడానికి పక్కాగా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. అకాడెమీ- బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఒకటొకటిగా బయటపడుతోంది. ఇప్పటికి అరవై కోట్లు మాయం అని లెక్క తేలింది. సన్నాసి సున్నాలదేముంది? ఇంకా పెరగవచ్చు. అకాడెమీ నుండి బ్యాంకుకు; బ్యాంకు నుండి బయటికి వెళ్లిపోయిన అరవై కోట్లు చివరికి ఎవరికి చేరిందో ఇప్పటికయితే తేలలేదు. తెలుగు అంతరించిపోతుందనుకుంటే ఏదో అనుకున్నారు. తెలుగు నిధులు అంతరిస్తే…తెలుగు ఆటోమేటిగ్గా అంతరిస్తుందన్న కుట్ర కోణం కూడా ఏమన్నా ఉందో? ఏం పాడో!

అకాడెమీ అదృష్టం బాగుంటే అరవై రూపాయలు, ఇంకా అదృష్టం గట్టిగా ఉంటే ఆరు వందల రూపాయలు వెనక్కు రావచ్చు. రాకపోయినా కేసుల వార్తలు చదవడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.

తెలుగు అకాడెమీ కుంభకోణం వార్త తెలుగు భాషాభిమానులకు ఒకేసారి బాధ- ఆనందం కలిగిస్తోంది.

తెలుగు విషాదం

ముప్పయ్ ఏళ్లుగా తెలుగు వెలుగు తగ్గుతూ వస్తోంది. అంటే…అది తెలుగు తప్పు కాదు. తెలుగు దీపానికి మనమే చమురు పోయడం కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంగ్లీషు దీపానికి పోయగా, తెలుగు గుడ్డి దీపం ప్రమిదలో విదల్చడానికి చుక్క చమురు మిగలడం లేదు. చమురులేని దీపంలో తెలుగు ఒత్తి బొత్తిగా పలకలేని ఒత్తుగా, వెలగలేని ఒత్తుగా మిణుకు మిణుకుమంటూ వెలగడాన్నే తెలుగు వెలుగుగా మనం అనుకుంటున్నాం. అన్నట్లు…ఈనాడు వారి తెలుగు వెలుగు మాసపత్రిక కూడా కొడిగట్టింది.

తెలుగు సామెత ప్రకారం తెలుగు అకాడెమీ దీపం వెలుగుతుండగానే నిధులను చక్కబెట్టుకున్నట్లున్నారు. తెలుగునే పట్టించుకోనప్పుడు…ఆ అకాడెమీలో నిధులను ఏమి పట్టించుకుంటారులే అన్నది వారి తెగింపు కావచ్చు. అవగాహన కావచ్చు. అవకాశం కావచ్చు.

తెలుగు అకాడెమీకి గ్రహాలన్నీ అనుకూలించి పోయిన సొమ్ము వెనక్కు రావాలని కోరుకుందాం.

Telugu Academy Funds Fraud

తెలుగు ఆనందం

మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందాన్ని సాధారణంగా మనం గుర్తించం. అకాడెమీ డబ్బులు పోయిన మొల లోతు బాధలో…మోకాటి లోతు ఆనందం ఏమిటంటే?

1.  పనికిరానిదని అందరూ వదిలేసిన అకాడెమీలో 350 కోట్ల దాకా ఫిక్సెడ్ డిపాజిట్లు ఉండడం.

2. తెలుగు పుస్తకాలు అమ్మినా వందల కోట్ల వ్యాపారం జరుగుతుందన్న భరోసా.

3. ఊరూ పేరూ లేకుండా పోయిన అకాడెమీ మళ్లీ వార్తల్లో వెలగడం.

4. విద్యను ఒకరు దొంగిలించలేరు అన్నది  లోకంలో ఒక నమ్మకం. కానీ ఆ విద్య అవిద్యగా మారితే ఇలా చోర విద్యగా పరిణమిస్తుందని అకాడెమీ చెప్పే పాఠం. లేదా గుణపాఠం.

అకాడెమీ ముంగిట్లో-

అక్షరాలు అక్షరాలా ఏడుస్తున్నాయి.
పేజీలు రాజీ పడి తిరగడం మానేశాయి.
పుస్తకాలు నెత్తి కొట్టుకుంటున్నాయి.
అకాడెమీ ఏనాడో అకడమిక్ స్పిరిట్ కోల్పోయింది.
ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్పిరిట్ కూడా కోల్పోయింది.
అకాడెమీకి గోచీ గుడ్డ అయినా మిగిలిందో? లేదో?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్