New script and fonts in Telugu advertisements
మీడియా వాణిజ్య ప్రకటనల్లో భాష మొదట్లో బాగానే ఉండేది. తరువాత యాంత్రిక అనువాదం, మక్కికి మక్కి అనువాదం, కృతక అనువాదాలు మొదలయ్యాక భాష తెరమరుగయ్యింది. ఇప్పుడన్నీ అనువాద ప్రకటనలే.
చివరికి తెలుగులో నేరుగా తయారయ్యే ప్రకటనలు కూడా మొదట ఇంగ్లీషులోనే అలోచించి…ఆపై తెలుగులోకి దించుతున్నారు. తెలుగును పొడిచి పొడిచి చంపి పాతి పెట్టేది తెలుగువారే. ఇన్నాళ్లూ అనువాదమే హత్యకు గురయ్యేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో లిపి కూడా హత్యకు గురవుతోంది. హంతకులను ఈ విషయంలో అభినందించాలి. భాషను సగం చంపి కోమాలో ఐ సి యు స్ట్రెచర్ మీద ఏళ్లకు ఏళ్లు పెట్టి అనవసరంగా ఆసుపత్రులను పోషించడం కంటే…పొతే ఒకే సారి పాడె కట్టి…చితి పెట్టి…చితా భస్మాన్ని స్మృతిపథంలో కలిపేసుకోవచ్చు.
వాణిజ్య ప్రకటనల్లో భాషను, లిపిని చంపేస్తున్నారని బాధపడుతున్నాం కానీ…డిజిటల్ విప్లవం వచ్చాక తెలుగు లిపిని వాడాల్సిన అవసరమే లేని విచిత్ర స్థితిలో ఉన్నాం.
మీరు గోళ్లు గిల్లుకుంటున్నారా?
అని తెలుగులో అఘోరిస్తే అవమానం…దేశద్రోహ నేరం కింద శాశ్వతంగా జైల్లో పెడతారు కాబట్టి…
Meeru gollu gillukuntunnara?
అని ఇంగ్లీషు లిపిలోనే ఇష్టంగా, బాధ్యతగా రాస్తున్నాం. ఇది గుడ్డిలో మెల్ల అని ఆధునిక డిజిటల్ తరం అంగీకరించింది. ఇంతకంటే ఘోరం- ఏ లిపి అవసరమే లేని ఇమోజి పాతరాతి యుగం బొమ్మల భాష.
నమస్కారం-
????
ఓకే
????
బాగుంది
????
అభినందనలు
????
భలే తమాషాగా చెప్పారు
????
ఏడ్చినట్లుంది
????
ఇంకా చాలా ఉన్నాయి కానీ…సభా మర్యాద దృష్ట్యా అన్నీ చెప్పడం కుదరదు.
తెలుగు వర్ణమాలలో ఉన్న అక్షరాలనే సరిగ్గా వాడక కొన్ని అక్షరాలు తమను తామే రద్దు చేసుకుని శాశ్వతంగా నామరూపాల్లేకుండా పోయాయి. భాషకు వేల ఏళ్ల ఆయుస్సును, శాశ్వతత్వాన్ని ఇచ్చేది లిపి ఒక్కటే. లిపిలేని తుళు లాంటి భాషల గతి ఏమిటో మన పొరుగున మంగళూరు తీరం వెంబడి చూస్తున్నాం.
తెలుగు లిపి ఫాంట్ వాడుక ఇదివరకు ముద్రణలో మాత్రమే అవసరం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడూ నన్నయ తిక్కన పోతనలకు అక్షరాలు నేర్పగలిగినవాళ్లే. తెలుగు ఇంగ్లీష్ కలగలిసిన సరికొత్త లిపి తెంగ్లీష్ లో వాడు రాసిందే తెలుగు. ఫాంట్ ఒకప్పుడు పెద్ద తతంగం. ఇప్పుడు ఇంగ్లీషు అక్షరాల్లో టైపు చేస్తే తెలుగు అక్షరాలు వచ్చే డిజిటల్ అవసరాల ఫాంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి.
ఈ డిజిటల్ తెలుగు లిపిలో అక్షరాలకు అక్షరాలా అవమానం జరుగుతోంది. అక్షరాల ఊపిరి ఆగిపోతోంది. ఆ అక్షరాలను ఎలా పలకాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భాష మూగబోతోంది.
ఉదాహరణకు ఒక రోజు ఈనాడు పత్రికలో రెండు ఫుల్ పేజీల ప్రకటన ఇవ్వాలంటే హీన పక్షం అరకోటి ఖర్చవుతుంది. ఇంకా ఎక్కువే కూడా కావచ్చు.క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ప్రకటనలో మొదలు పెట్టండి అన్న మాటలో “మొ” ఎలా ఉందో చూడండి.
ఏదో- ఎదో అయ్యింది.
తో- లో అయ్యింది. ఇదేదో డిజిటల్ ఫాంట్ అజ్ఞానం అయి ఉంటుంది.కొ అన్నప్పుడు క కు ఒత్వం పైన వచ్చినట్లు…మ అక్షరంలో కొమ్ము మీద ఒత్వం వచ్చింది. మొ మొహం మారిపోయినా మన లిపి మొహానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇంగ్లీషు మోహంలో మన తెలుగు మొహం ఎప్పుడో మారిపోయింది.
ప్రవహించేదే భాష. లిపి కూడా మారుతూ ఉంటుంది. బిట్ కాయిన్ అంటే మిథ్యా నగదు. పేరుకు తగ్గట్టు వారి ప్రకటనలో లిపి కూడా మిథ్యగానే ఉంది. తెలుగు వెలుగుకు పాటుపడుతూ ప్రయత్నపూర్వకంగా తెలుగు మాటలనే సృష్టించి వాడుతున్న తెలుగు ప్రజల గుండె చప్పుడు ఈనాడు మొదటి పేజీ ప్రకటనలోనే తెలుగు లిపిలో లేని అక్షరాల భాష రావడం ఒక వైచిత్రి. వచ్చిన ప్రకటన వేయడమే తప్ప అందులో లిపితో ఈనాడుకు సంబంధం ఉండదు కాబట్టి…మన ఖర్మకు మనమే బాధ్యులుగా…మనల్ను మనమే నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేము.
మన అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇలాగే దిన దిన ప్రవర్ధమానమవుతూ ఉంటే…ఏదో ఒకనాటికి తెలుగు లిపిలేని భాషగా మిగిలిపోతుంది.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: