Movie Review: ప్రతి ఒక్కరి జీవితం అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఎవరి స్థాయిలో వారు ఎంతోకొంత సాధించడం జరుగుతూనే ఉంటుంది. పైకి వచ్చిన ప్రతివారూ కూడా కష్టపడి పైకి వచ్చామని అంటారే తప్ప, ఎంతోమంది సహకరించడం వలన ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామని మాత్రం అనరు. అలా అనేవాళ్లు చాలా తక్కువ. లైఫ్ లో ఒకసారి వెనక్కి వెళితే, మనకి సహకరించినవాళ్లు ఎవరన్నది అర్థమవుతుంది .. అప్పుడు వాళ్లకి ‘థ్యాంక్స్’ చెప్పండి అనే కంటెంట్ తో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ రోజునే విడుదలైంది.
అభి (నాగచైతన్య) పల్లెటూరు నుంచి ఫారిన్ వెళ్లి అక్కడ చక్రం తిప్పుతాడు. చాలా చిన్న వయసులోనే కోట్లు గడించిన అభి, తన సక్సెస్ కి తాను మాత్రమే కారణమనే గర్వంతో ఒక్కొక్కరికీ దూరమవుతుంటాడు. అప్పుడు అంతరాత్మ అతణ్ణి ప్రశ్నిస్తుంది. జీవితంలో ఓ సారి వెనక్కి వెళితే ఆయన గెలుపులో ఎంతమంది భాగముందనేది అర్థమవుతుందని చెబుతుంది. దాంతో ఫారిన్ నుంచి తాను పుట్టి పెరిగిన … చదువుకున్న ఊళ్లకు వెళతాడు. గతంలో అక్కడ అభి జీవితంలోకి ఎవరెవరు ఎలా ప్రవేశించారు? ఎలా ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారనేదే కథ.
ఫస్టాఫ్ లోను .. సెకండాఫ్ లోను కథలో సాగతీత కనిపిస్తుంది. సన్నివేశాలు చకచకమంటూ పరిగెత్తవు. కథనం అంత ఆసక్తికరంగా అనిపించదు. ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ వంటి పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నప్పుడు ఆ పాత్రల నుంచి ఆడియన్స్ ఎక్కువ ఆశిస్తారు. ఆ పాత్రలపై విక్రమ్ కుమార్ అంతగా దృష్టి పెట్టకపోవడం కనిపిస్తుంది. అందువలన బలమైన పాత్రలు అనుకున్నవి తేలిపోతూ .. తెరపై చాలా తక్కువసేపు మాత్రమే కనిపిస్తాయి. మాళవిక నాయర్ కి సంబంధించిన ఎపిసోడ్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకాలేని ఈ సినిమా, కొన్ని చోట్ల మాత్రమే మనసు తలుపులు తడుతుంది.
Also Read : ‘గార్గి’ పోరాటం ఫలించినట్టేనా?